దుబాయ్ హబ్‌కు ఆపిల్ గుడ్ బై? కొత్త రూట్లలో మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ల తరలింపు..

దుబాయ్ హబ్‌కు ఆపిల్ గుడ్ బై? కొత్త రూట్లలో మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ల తరలింపు..

పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధం ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ వ్యూహాలను పూర్తిగా మార్చేస్తోంది. ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల మీదుగా సాగే వాణిజ్య మార్గాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల భారత్ నుంచి ఎగుమతయ్యే ఐఫోన్ల సరఫరాకు దుబాయ్ కీలక ట్రాన్సిట్ హబ్‌గా ఉండేది. అయితే ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా ఆపిల్ తన గ్లోబల్ సప్లై చైన్ రూటును మార్చేస్తూ.. దుబాయ్‌ను పక్కన పెట్టి ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతోంది.

భారత్ నుంచి ఐఫోన్ల ఎగుమతుల్లో దుబాయ్ పాత్ర చాలా కీలకం. 2025 క్యాలెండర్ సంవత్సరంలో భారత్ నుంచి యూఏఈకి దాదాపు 4.2 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి అయ్యాయి. అంటే మన కరెన్సీలో సుమారు రూ.37వేల 800 కోట్లు వాటి విలువ. ఇందులో కేవలం ఐఫోన్ల వాటానే 3.6 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.32వేల 400 కోట్లు. శాంసంగ్ ఫోన్లు మరో రూ.4వేల 500 కోట్ల వరకు ఉన్నాయి. భారత్ నుంచి జరిగే మొత్తం మొబైల్ ఎగుమతుల్లో 14 శాతం వాటా ఈ ప్రాంతానిదే. కానీ యుద్ధం వల్ల విమాన మార్గాల్లో ఆంక్షలతో పాటుగా పెరుగుతున్న ఇంధన ధరలు ఆపిల్‌ను పునరాలోచనలో పడేశాయి.

ఈ మార్పు ప్రభావం కేవలం ఆపిల్‌పైనే కాకుండా.. భారత్‌లోని ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, డిక్సన్ టెక్నాలజీస్ వంటి తయారీ సంస్థలపై కూడా పడుతోంది. ఎయిర్ కార్గో ఆపరేటర్లు ఇప్పటికే తమ రూట్లను మార్చేశారు. దుబాయ్ మీదుగా కాకుండా సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా మీదుగా సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో విమాన ఇంధన ఖర్చులు, ఇన్సూరెన్స్ ఛార్జీలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కో ఫ్లైట్‌కు వేల డాలర్ల అదనపు భారం పడుతోంది. ఈ అదనపు ఖర్చుల వల్ల స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థల లాభాల మార్జిన్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే గల్ఫ్ దేశాల్లో వినియోగం కూడా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆపిల్ ఇప్పుడు అమెరికా, బ్రిటన్, జపాన్, నెదర్లాండ్స్ వంటి దేశాలకు నేరుగా ఎగుమతులు పెంచేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ భారత్‌లో ఐఫోన్ల తయారీ వేగం తగ్గడం లేదు. 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి నాలుగు ఐఫోన్లలో ఒకటి భారత్‌లోనే తయారవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం తెచ్చిన ఈ సవాళ్లను అధిగమిస్తూ ఆపిల్ తన మేడ్ ఇన్ ఇండియా ప్రయాణాన్ని కొత్త మార్గంలో కొనసాగిస్తోంది.