13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నో.. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ బిల్లు

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నో.. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ బిల్లు

గడచిన కొన్నాళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు పిల్లలను సోషల్ మీడియా మాయలో పడకుండా కాపాడేందుకు కఠిన నిబంధనలు తీసుకొస్తున్నాయి. అనేక యూరోపియన్ దేశాలు కూడా వయస్సు పరిమితులతో పాటు పిల్లలకు ఎలాంటి కంటెంట్ వెళ్లకూడదు అనేదానిపై అమెరికన్ సోషల్ మీడియా దిగ్గజాలకు మెుహమాటం లేకుండా చెప్పేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కూడా 13 ఏళ్ల లోపు చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని చూస్తోంది. 

13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఖాతాలు తెరవడంపై కఠిన నిబంధనలు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా ‘సేఫ్‌గార్డింగ్ హెల్తీ ఇంటర్నెట్ ఎన్విరాన్‌మెంట్స్ ఫర్ లిటిల్ డిజిటల్-నేటివ్స్(SHIELD) బిల్, 2025’ను ప్రతిపాదించారు. ఈ బిల్లు ప్రకారం 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా, గేమింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే ధ్రువీకరించిన తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి కానుంది. మైనర్లను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు డేటాను సేకరించడం, వారి ప్రవర్తనను ట్రాక్ చేయడం, ప్రొఫైలింగ్ చేయడం, పర్సనలైజ్డ్ యాడ్స్ కూడా నిషేధించాలని ప్రతిపాదించారు.

మైనర్లకు ప్రత్యేక భద్రతా వ్యవస్థలు
SHIELD బిల్లు 18 ఏళ్లలోపు వారిని పిల్లలుగా పరిగణిస్తూ సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్‌తో పాటు ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రత్యేక భద్రతా బాధ్యతలు విధించాలని సూచిస్తోంది. మైనర్లు ఉపయోగించే ప్లాట్‌ఫామ్‌లలో తప్పనిసరిగా ఏజ్ వెరిఫికేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అలాగే తల్లిదండ్రుల కోసం ప్రత్యేక డ్యాష్‌బోర్డులు తీసుకురావాలని పేర్కొంది. వీటి ద్వారా పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడం, ప్రైవసీ సెట్టింగులను నిర్వహించడం, స్క్రీన్ టైమ్‌పై పరిమితులు విధించడం వంటి ఆప్షన్స్ తల్లిదండ్రులకు కల్పించాల్సిందే.

ప్రమాదకర కంటెంట్‌కు అడ్డుకట్ట..
పిల్లలు పోర్నోగ్రఫీ, జూదం, సిమ్యులేటెడ్ బెట్టింగ్, హింసాత్మక తీవ్రవాద కంటెంట్, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం జోలికి పోకుండా ప్లాట్‌ఫామ్‌లు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని బిల్లు సూచిస్తోంది. డిజిటల్ ప్రపంచంలో పిల్లలపై పెరుగుతున్న ప్రభావం, ఆన్‌లైన్ వ్యసనం, హానికరమైన కంటెంట్‌ నుంచి రక్షణ కల్పించడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

ALSO READ : ఎగిరే ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసింది.. 

రూ.10 కోట్ల వరకు జరిమానా..
ఒకవేళ రూల్స్ ఉల్లంఘించే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా, పదేపదే రూల్స్ ఉల్లంఘిస్తే సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం, ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద ప్లాట్‌ఫామ్‌ను బ్లాక్ చేసే చర్యలు తీసుకోవచ్చని బిల్లు ప్రతిపాదిస్తోంది. అయితే ఈ బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లు కావడంతో చట్టంగా మారే అవకాశం ప్రస్తుతం పరిమితంగానే ఉంటుంది.