దేశంలో రానున్న దసరా దీపావళి పండుగ షాపింగ్ సీజన్ కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు భారీ సేల్స్‌కు సిద్ధమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభించే ఈ సమయంలో షాపర్లు ఆఫర్లను పోల్చి చూసేందుకు AI టూల్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఏఐ ఆధారిత ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసాలు, ఫ్రాడ్, డేటా గోప్యతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి.
పండుగ సేల్స్ సమయంలో కేవలం సాధారణ డిస్కౌంట్స్ మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ప్లాన్లు కూడా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ఫైనల్ ధర అనేది అనేక నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. నాట్‌వెస్ట్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఐఎన్‌జీ, క్యాపిటల్ వన్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకులు ఏఐ షాపింగ్ ఏజెంట్ల పట్ల ఆసక్తి పెరుగుతున్నట్లు గుర్తించాయి. అయితే ఈ సాంకేతికత వినియోగదారుల రక్షణ ప్రమాణాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్, మెటా వంటి సంస్థలు ప్రమోట్ చేస్తున్న ఏఐ అసిస్టెంట్లు సెర్చ్ చేయడం, ఆప్షన్లను పోల్చడం, కొనుగోళ్లు పూర్తి చేయడంలో సహాయపడతాయి. అయితే ఈ ఏఐ ఏజెంట్లు ఎప్పుడూ వినియోగదారుల ప్రయోజనాలే కోరుకుంటాయనే గ్యారెంటీ లేదని గుర్తుంచుకోవాలి. పండుగ రద్దీలో వివిధ ప్రమోషనల్ ఆఫర్లు, ప్రకటనల మధ్య ఏఐ వాడకం ఆన్‌లైన్ కొనుగోళ్లను మరింత సంక్లిష్టం చేసే ప్రమాదం ఉంది.
అందువల్ల షాపర్లు ఏఐ టూల్స్ వాడేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఆఫర్ల నిజానిజాలను నేరుగా అధికారిక వెబ్‌సైట్లలో తనిఖీ చేయాలి. పర్సనల్ ఆర్థిక వివరాలను అనుమానాస్పద లింక్‌లలో షేర్ చేయకూడదు. ఈ పండుగ సీజన్‌లో ఏఐని కేవలం ఒక మార్గదర్శిగా మాత్రమే వాడుతూ.. ఫైనల్ నిర్ణయాలను కస్టమర్లు తమ సొంత పరిశీలనతో తీసుకుంటే ఆర్థిక మోసాల బారిన పడకుండా సురక్షితంగా షాపింగ్ చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత ఏఐ వాడినా దానిని కేవలం సెర్చ్ వరకూ పరిమితం చేయటం మంచిది.
