వరంగల్, వెలుగు: ‘బండి సంజయ్.. ముందు నీ కుటుంబం సంగతి చూస్తో, గాంధీ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి నీది కాదు..’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హనుమకొండ కాంగ్రెస్ భవన్‌లో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీలది త్యాగాల కుటుంబమన్నారు.
బీజేపీలో దొంగలు, ద్రోహులు ఉన్నారని, 125 సార్లు అయోధ్య రాముని పేరుతో దోచుకున్నారని విమర్శించారు. బీఆర్‍ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జాలు పెట్టి బినామీ పేర్లతో ఫామ్ హౌజ్‍లు కట్టుకున్నారని ఆరోపించారు. సత్యం రామలింగరాజు భూములను సైతం కేటీఆర్ కుటుంబం అక్రమంగా తమవిగా రికార్డులో చేర్చకుందన్నారు.
కేసీఆర్ కుటుంబానికి తాతముత్తాల నుంచి ఉన్న ఆస్తులేంటో చూపాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాలనలో బీఆర్‍ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను పట్టించుకోలేదని.. కాంగ్రెస్ సర్కార్ రూ.300 కోట్లతో భూసేకరణ చేయడంతో ఎయిర్‍పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకొచ్చిందన్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో కొందరు డాక్టర్లు విధులకు డుమ్మా కొడుతూ చెడ్డపేరు తీసుకొస్తున్నట్లు చెప్పారు.
సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ పనులు చివరి దశలో ఉన్నాయని, ఈ క్రమంలో ఎంజీఎం రిపేర్లపై కొంత నిర్లక్ష్యం వహిస్తున్నది నిజమేనన్నారు. ఎంజీఎం సమస్య ఏంటో తమకు తెలుసు కాబట్టే తామే స్వయంగా సీఎం రేవంత్‍రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. త్వరలోనే సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ ప్రారంభించేలా సీఎం చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రేటర్‍లో పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనల కోసం దసరా నాటికి సీఎం రేవంత్‍రెడ్డి వరంగల్ పర్యటనకు రానున్నట్లు వెల్లడించారు.
