లంచ్‌బాక్స్‌లో మెంతి కూర తెచ్చినందుకు రూ.50 జరిమానా ! మహారాష్ట్ర స్కూలుకు మున్సిపల్ నోటీసు

లంచ్‌బాక్స్‌లో మెంతి కూర తెచ్చినందుకు రూ.50 జరిమానా ! మహారాష్ట్ర స్కూలుకు మున్సిపల్ నోటీసు

స్కూల్‌కి తెచ్చే లంచ్‌బాక్స్‌లో మెంతి కూర తెచ్చాడనే కారణంతో ఒక విద్యార్థికి రూ.50 జరిమానా విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలోని భయందర్ (ఈస్ట్) ప్రాంతంలో ఉన్న తపోవన్ విద్యాలయం అనే ప్రైవేట్ స్కూల్‌లో ఈ ఘటన జరగ్గా... దీనిపై తల్లిదండ్రులు, స్థానిక నాయకులు ఫిర్యాదు చేయడంతో మీరా-భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (MBMC) సదరు స్కూల్ యాజమాన్యానికి షో-కాజ్ నోటీసు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే ?
జైనుల పవిత్ర పండుగ అయిన 'పర్యుషణ్' రోజుల్లో, ఆ స్కూల్‌ల్లో  చదువుతున్న ఒక విద్యార్థి  ఇంట్లో వండిన మెంతి కూరను లంచ్‌బాక్స్‌లో తెచ్చుకున్నాడు. ఈ స్కూల్‌లో ఎక్కువ మంది జైన మతానికి చెందిన విద్యార్థులు ఉంటారు. అయితే  జైన ఆహార నియమాల ప్రకారం కొన్ని రకాల దుంపకూరలు, ఆకుకూరలను ఇక్కడ తినరు.

అందుకని, జైన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా కొన్ని కూరగాయలు స్కూల్‌కు తేకూడదనే నిబంధనను ఈ స్కూల్ విధించింది. దింతో ఆ విద్యార్థి మెంతి కూర తెచ్చి ఈ నిబంధనను ఉల్లంఘించాడనే నెపంతో స్కూల్ యాజమాన్యం అతనికి రూ.50 క్రమశిక్షణా జరిమానా విధించింది.

అధికారులు ఏం చెప్పారంటే 
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు MBMC విద్యాశాఖ అధికారి సులభ వటారే స్కూలుకు నోటీసులు పంపారు. పిల్లలు ఇళ్ల నుంచి తెచ్చుకునే ఆహారంపై స్కూళ్లు ఆంక్షలు విధించడం గానీ, జరిమానాలు వేయడం గానీ సరికాదని స్పష్టం చేశారు. ఇది విద్యార్థుల ప్రాథమిక హక్కులను, విద్యా హక్కు చట్టం (RTE) నిబంధనలను ఉల్లంఘించడమేనని నోటీసులో పేర్కొన్నారు. ఈ అంశంపై స్కూల్ సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్కూల్ యాజమాన్యం వివరణ
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే లంచ్ బాక్స్/ టిఫిన్లకు సంబంధించిన మార్గదర్శకాలను తల్లిదండ్రులకు చెప్పామని స్కూల్ ప్రతినిధులు తెలిపారు. జైన సమాజపు మతపరమైన, ఆహారపు అలవాట్లను గౌరవించడానికే ఈ నియమాలు పెట్టామని వివరించారు.

రూ.50 అనేది కేవలం పదే పదే నిబంధనలు దాటేవారిని క్రమశిక్షణలో ఉంచడానికే తప్ప, డబ్బులు వసూలు చేయడానికి కాదని చెప్పారు. అయితే, అధికారుల జోక్యంతో ఈ నియమాలను మళ్లీ సమీక్షిస్తామని వెల్లడించారు.