రేపు(23) అర్థరాత్రి వరకే దర్శనం సెప్టెంబర్ 25న బడా గణేశ్ నిమజ్జనం

  రేపు(23) అర్థరాత్రి వరకే దర్శనం  సెప్టెంబర్ 25న బడా గణేశ్ నిమజ్జనం

హైదరాబాద్:  ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద భక్తుల తాకిడి తారాస్థాయికి చేరింది. వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో ఇవాళ తొమ్మిదో రోజు  మహా గణపతిని కనులారా  వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

సెప్టెంబర్ 24న నిమర్జన ఏర్పాట్లు ప్రారంభం కానున్నందున, రేపు (సెప్టెంబర్ 23) అర్ధరాత్రి 12 గంటల వరకే భక్తులకు దర్శనానికి అవకాశం ఉంటుంది. ఈనెల 25వ తేదీన బడా గణేష్ నిమర్జన యాత్ర అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.కేవలం గడిచిన 8 రోజుల్లోనే సుమారు 16 లక్షలకు పైగా భక్తులు మహా గణపతిని దర్శించుకున్నట్లు అంచనా వేయగా, నేడు ఒక్కరోజే లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది.

ఈ ఏడాది ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన 69 అడుగుల పంచముఖ సంకటహర మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి తోపులాటలు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం నలువైపులా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.