టాయిలెట్‌‌కు వెళ్తానని చెప్పి పోక్సో కేసు ఖైదీ పరార్

టాయిలెట్‌‌కు వెళ్తానని చెప్పి పోక్సో కేసు ఖైదీ పరార్

జూబ్లీహిల్స్, వెలుగు: పోక్సో కేసు ఖైదీ పోలీసు ఎస్కార్ట్ సిబ్బంది కస్టడీ నుంచి తప్పించుకున్న ఘటన మంగళవారం బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. పోక్సో కేసులో చంచల్‌‌గూడ జైలులో ఖైదీగా ఉన్న వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి (22)ని వైద్య పరీక్షల నిమిత్తం మంగళవారం ఎర్రగడ్డలోని జేఎంహెచ్‌‌కు ఎస్కార్ట్ సిబ్బంది తీసుకొచ్చారు. 

వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం టాయిలెట్‌‌కు వెళ్లాలని అతడు సిబ్బందిని కోరాడు. దీంతో అనుమతించిన పోలీసులు కిషోర్ కుమార్ రెడ్డిని టాయిలెట్‌‌కు పంపించారు. అక్కడ అతను వెంటిలేటర్‌‌ ఎక్కి బయటకు దూకి పరారయ్యాడు. ఖైదీ కనిపించకపోవడంతో ఎస్కార్ట్ సిబ్బంది..ఆసుపత్రి పరిసర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. 

దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించి, అనంతరం బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారైన ఖైదీ కోసం పోలీసులు ఆసుపత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.