మునగాల మండల కేంద్రంలో విద్యుత్ కోతలపై.. బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు 

మునగాల మండల కేంద్రంలో విద్యుత్ కోతలపై.. బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు 

సూర్యాపేట/ఆమనగల్లు, వెలుగు : విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు 33 కేవీ సబ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించి, 65వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.  మునగాల సబ్ స్టేషన్ ముందు దున్నపోతుకు వినతి పత్రం అందిజేసి నిరసన తెలిపారు.

  మల్లయ్య యాదవ్​ మాట్లాడుతూ సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకుండా పక్క జిల్లాలోని పాలేరుకు తరలిస్తున్నారని, 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.  నల్గొండ జిల్లా మాడుగులపల్లి సబ్ స్టేషన్ వద్ద కూడా బీఆర్ఎస్ నేతలు పగిళ్ల సైదులు, పెద్ది కృపాకర్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టి, సాగునీరు, విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్ విద్యుత్ సబ్ స్టేషన్ ముందు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా చేపట్టారు. వ్యవసాయానికి కనీసం 6 గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదని, లో వోల్టేజీ సమస్యతో మోటర్లు నడవక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని వారు ఆరోపించారు. పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.