భారత్-న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.. ఇకపై డెడ్ చీప్ రేట్లకే కివీ ఫ్రూట్స్ దొరుకుతాయ్!

భారత్-న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.. ఇకపై డెడ్ చీప్ రేట్లకే కివీ ఫ్రూట్స్ దొరుకుతాయ్!

భారత్, న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా రాబోయే రోజుల్లో న్యూజిలాండ్ నుంచి దిగుమతి అయ్యే కివీ పండ్లు మరింత చౌకగా లభించే అవకాశం ఉంది. అయితే టారిఫ్-రేట్ కోటా, కనీస దిగుమతి ధర నిబంధనల కారణంగా ఈ ధరల తగ్గింపు ప్రారంభంలో పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 2026లో ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేశాయి. డొమెస్టిక్ ప్రక్రియలు ముగిసిన తర్వాత ఈ ఒప్పందం అక్టోబర్ నెలలో అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్‌కు కివీస్, ఆపిల్స్, మనుకా హనీ వంటి ఉత్పత్తులపై ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుంది.

ప్రస్తుతం భారత్ కివీ దిగుమతులపై 33% కస్టమ్స్ డ్యూటీని విధిస్తోంది. కొత్త ఎఫ్‌టీఏ ప్రకారం మొదటి సంవత్సరంలో న్యూజిలాండ్ నుంచి 6వేల250 టన్నుల కివీలను డ్యూటీ-ఫ్రీ అంటే ఎలాంటి టాక్సులు లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. ఈ కోటా 6వ సంవత్సరానికి 15వేల టన్నులకు క్రమంగా పెరుగుతుంది. కోటా పరిధిలోకి వచ్చే దిగుమతులకు సున్నా సుంకం వర్తిస్తుంది. అయితే కిలోకి కనీసం 1.80 అమెరికన్ డాలర్ల కనీస దిగుమతి ధర ఉండాలి. కోటా దాటి వచ్చే షిప్‌మెంట్లపై టారిఫ్ గతంలో కంటే 50% తగ్గి.. 16.5%కి పడిపోతుంది. అయినప్పటికీ సరుకు రవాణా, ఇన్సూరెన్స్, కోల్డ్ స్టోరేజ్, లాభాల మార్జిన్లు వంటి వివిధ కారణాల వల్ల రిటైల్ ధర వెంటనే భారీగా పడిపోకపోవచ్చు.

భారత్‌లో కివీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. 2024లో భారత్ సుమారు 49.14 మిలియన్ కిలోల తాజా కివీలను దిగుమతి చేసుకుంది. ఇరాన్ అత్యధికంగా భారతదేశానికి వీటిని సరఫరా చేయగా, కిలో విలువ పరంగా న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కివీ సాగు జరుగుతున్నప్పటికీ.. దేశీయ ఉత్పత్తి డిమాండ్‌లో కేవలం 25% మాత్రమే ఉంటోంది. మిగిలిన 75% అవసరాల కోసం భారత్ పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాలు తగ్గడం వల్ల పట్టణ మార్కెట్లలో నాణ్యమైన కివీస్ మరింత సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయి.

ALSO READ ; అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ కోసం AI టూల్స్ వాడుతున్నారు?

ఆరోగ్యపరంగా కివీస్ చాలా ప్రయోజనకరమైనవి. ఒక్క కివీ పండు ద్వారా పెద్దలకు రోజూ కావలసిన విటమిన్ C లో దాదాపు 80% లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ ఇ, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఒప్పందం ద్వారా కివీస్ తక్కువ ధరకు లభించకపోయినా, మెరుగైన నాణ్యత కలిగిన న్యూజిలాండ్ కివీస్ మరింత పోటీ ధరలకు భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.