హైదరాబాద్: నల్లగొండ జిల్లా దేవరకొండలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కరెంట్ షాకుతో భార్యాభర్తలు మృతి చెందారు. వివరాల ప్రకారం.. సోఫియా బేగం, మహమ్మద్ దావుద్ మియా భార్యాభర్తలు. దేవరకొండ పట్టణంలోని అంజయ్య కాలనీలో నివాసం ఉంటున్నారు.
బుధవారం (సెప్టెంబర్ 23) తెల్లవారుజూమున ఇంట్లో టేబుల్ ఫ్యాన్ స్విచ్ వేస్తుండగా సోఫియా బేగం విద్యుత్ ఘాతానికి గురైంది. గమనించిన దావుద్ మియా భార్యను కాపాడేందుకు ప్రయత్నించాడు. భార్యను కాపాడే క్రమంలో దావుద్ మియాకు కూడా కరెంట్ షాక్ కొట్టింది. విద్యుత్ ఘాతంతో సోఫియా బేగం, మహమ్మద్ దావుద్ మియా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అంజయ్య కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
