- హైదరాబాద్‌కు 80 రోజుల నీళ్లే
- ముందస్తు ప్లానింగ్లో జలమండలి
- 19,543 మెగావాట్ల కరెంట్ డిమాండ్
- కొనుగోళ్లకు సర్కారు సంప్రదింపులు
- పాలు, కూరగాయల రేట్లు పెరిగే చాన్స్
- వలసలు ఆపేందుకు ప్రత్యేక చర్యలు
- గ్రామాల్లో ‘ఉపాధి’ పనులకు ఊతం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంపై ‘ఎల్‌నినో’ పిడుగు పడబోతున్నది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవకపోతే కష్టకాలం తప్పదని ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ముందస్తు నివేదిక స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరంలో మరో 80 రోజులకు మాత్రమే సరిపడా తాగునీరు మిగిలి ఉన్నదని, వర్షాభావం కొనసాగితే దాదాపు 4 లక్షల ఇండ్లకు నల్లా నీళ్లు బంద్ అయ్యే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నది. విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతుందని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతాయని, పల్లెల్లో ఉపాధి కరువై నగరాలకు వలసలు పోటెత్తే అవకాశం ఉన్నదని సర్కారును అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు, ప్రజలకు తాగునీరు, విద్యుత్ కొరత రాకుండా చూసేందుకు ఇప్పటికే సమగ్ర యాక్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది.
జీఎస్‌డీపీ మందగమనం..
రాష్ట్రంలో ముంచుకొస్తున్న ఎల్‌నినో పరిస్థితులు కేవలం వర్షాలు, పంటలకే పరిమితం కాకుండా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (జీఎస్‌డీపీ)ను దెబ్బతీయబోతున్నాయని ఉన్నతాధికారుల నివేదిక పేర్కొన్నది. రాష్ట్ర ఎకానమీలో వ్యవసాయం కుప్పకూలితే అది గొలుసుకట్టులా (డోమినో ఎఫెక్ట్) సమస్త రంగాలనూ ఎలా అతలాకుతలం చేయనున్నదో వెల్లడించింది.‘‘ఎల్‌నినో వల్ల వర్షాభావం ఏర్పడి పంటలు ఎండిపోతే, గ్రామీణ ప్రజల చేతుల్లో డబ్బు మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. చేతిలో డబ్బు లేకపోవడంతో గ్రామీణ కొనుగోలు శక్తి కుప్పకూలుతుంది. దీని ప్రభావంతో రైతులు కొత్తగా ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు కొనడం ఆపేస్తారు. పల్లెల్లో బైకులు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు.. చివరికి కన్స్యూమర్ గూడ్స్ అమ్మకాలు సైతం 30 నుంచి 40 శాతం పడిపోయే ప్రమాదం ఉంది”అని హెచ్చరించింది.ఇది నేరుగా పారిశ్రామిక రంగాన్ని, వాణిజ్య వ్యాపారాలను తీవ్ర మాంద్యంలోకి నెడుతుందని, మరోవైపు తీవ్ర నీటి కొరత, విపరీతమైన ఎండల కారణంగా పట్టణాల్లో నిర్మాణ పనులు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు స్తంభించిపోయే అవకాశం ఉందని వెల్లడించింది. ‘‘ఫలితంగా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులైన ‘స్టాంపులు-రిజిస్ట్రేషన్లు’ పడిపోవడంతోపాటు వ్యాపార లావాదేవీలు తగ్గడం వల్ల వాణిజ్య పన్నులు (ఎస్‌జీఎస్‌టీ) భారీగా క్షీణిస్తాయి. ఇలా సేవా, పారిశ్రామిక రంగాలు కూడా ఒకేసారి డీలా పడిపోయి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు వేగంగా పతనమయ్యే ప్రమాదం ఉంది” అని వివరించింది .
కనీస కోత అయినా పడే ప్రమాదం
గత రెండు, మూడేండ్లుగా తెలంగాణ జీఎస్‌డీపీ స్థిరమైన వృద్ధితో దూసుకుపోతున్నది. 2024--–25లో రూ. 16.10 లక్షల కోట్లుగా జీఎస్‌డీపీ సవరించిన అంచనాలు ఉన్నాయి. 2025–26 అంచనాలు రూ. 18 లక్షల కోట్లు కాగా.. 2026–27 అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 20 లక్షల కోట్ల జీఎస్‌డీపీ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు నివేదిక పేర్కొన్నది. అయితే, ఎల్‌నినో సృష్టించే విలయం వల్ల ప్రస్తుత వృద్ధి రేటులో కనీస కోత అయిన పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. జీఎస్‌డీపీలో 1 నుంచి 2 శాతం వృద్ధి తగ్గినా, రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల సొంత పన్నుల రాబడి (ఎస్‌వోటీఆర్) గండి పడుతుందని హెచ్చరించింది. గతంలో రాష్ట్రం ఎదుర్కొన్న తీవ్రమైన ఎల్‌నినో అనుభవాలు కూడా ఇదే హెచ్చరికను చేసినట్టు గుర్తుచేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో, అంటే 2015–-16 ఆర్థిక సంవత్సరంలో బలమైన ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నట్టు వివరించింది. ఆ సమయంలో రాష్ట్ర వ్యవసాయ రంగం ఏకంగా మైనస్ 7.8 శాతం నెగెటివ్ గ్రోత్ నమోదు చేసిందని, మళ్లీ ఇప్పుడు అలాంటి తీవ్రమైన ఎల్‌నినో పునరావృతమైతే, ఈసారి ఎకానమీ పరిమాణం చాలా పెద్దది కాబట్టి నష్టం తీవ్రత కూడా పెద్ద స్థాయిలో ఊహించాల్సి ఉందని హెచ్చరించింది. ఈ విపత్కర పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి.. రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ప్రస్తుతమున్న 3.0 శాతం నుంచి అదనంగా మరో 0.5 శాతం పెంచి, 3.5 శాతానికి అనుమతించేలా కేంద్ర ప్రభుత్వంపై తక్షణమే గట్టి ఒత్తిడి తీసుకురావాలని నివేదిక సిఫార్సు చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 0.5 శాతం పెంచుకోగలిగితే తెలంగాణకు అదనంగా దాదాపు రూ.9 వేల కోట్ల వరకు అప్పు తీసుకునే వెసులుబాటు లభిస్తుందని స్పష్టం చేసింది.
ఊహించని రీతిలో విద్యుత్ వినియోగం
వర్షాభావం వల్ల భూగర్భ జలాలు అట్టడుగుకు పడిపోవడంతో రైతులు బోరుబావుల మోటార్లను నిరంతరం నడపాల్సి రావడం, గృహ రంగంలో ఏసీలు, ఫ్రిడ్జ్‌ల వాడకం పెరగడంతో విద్యుత్ వినియోగం ఊహించని రీతిలో పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. ఇటీవల సెప్టెంబర్ 9న ఉదయం 10:41 గంటలకు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 19,543 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదై ఆల్-టైమ్ రికార్డు సృష్టించిందని వివరించింది. ప్రస్తుతం రాష్ట్రం వినియోగిస్తున్న విద్యుత్‌లో వ్యవసాయ రంగానికి అత్యధికంగా 35 నుంచి -40 శాతం ఉచిత విద్యుత్ రూపంలో వెళ్తుండగా, గృహ అవసరాలకు 30- నుంచి 35 శాతం, పారిశ్రామిక వాణిజ్య (కమర్షియల్) రంగానికి మరో 25-నుంచి 30 శాతం వరకు వినియోగమవుతోంది. ఎల్‌నినో తీవ్రతతో డిమాండ్ నిరంతరం 19,500 మెగావాట్ల పైనే కొనసాగే అవకాశముండటంతో వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని హెచ్చరించింది. మరోవైపు, ఈ స్థాయిలో పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్రంలో స్థానిక విద్యుత్ ఉత్పత్తి ప్రతిబంధకాలను ఎదుర్కొంటోందని చెప్పింది. ‘‘రాష్ట్ర స్థానిక విద్యుత్ సరఫరాలో సింహభాగం జెన్‌కో, ఎన్టీపీసీ సెంట్రల్ పూల్ థర్మల్ ప్రాజెక్టుల నుంచే (దాదాపు 70 శాతం) లభిస్తోంది. ఇక శ్రీశైలం, నాగార్జునసాగర్‌లాంటి ప్రధాన ప్రాజెక్టుల ద్వారా 15 శాతం జల విద్యుత్, సోలార్‌తో పాటు ఇతర పునరుత్పాదక వనరుల ద్వారా మరో 15 శాతం మేర నిరంతర విద్యుత్ సేకరిస్తున్నారు. అయితే ఎల్‌నినో వల్ల వర్షాలు లేక రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోవడంతో జల విద్యుత్ ఉత్పత్తి దాదాపు శూన్యమయ్యే ప్రమాదం ఏర్పడింది. తీవ్రమైన నీటి కొరత వల్ల థర్మల్ ప్లాంట్ల కూలింగ్ వ్యవస్థలైనా దెబ్బతినే అవకాశం ఉంది” అని నివేదిక వెల్లడించింది. ఈ భారీ కొరతను భర్తీ చేయడానికి బహిరంగ మార్కెట్ (ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ -) నుంచి పెద్ద మొత్తంలో విద్యుత్ కొనడం మినహా ట్రాన్స్‌కో, డిస్కంలకు వేరే మార్గం లేదని తెలిపింది. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్‌లో పీక్ అవర్స్‌లో యూనిట్ ధర రూ.10 నుంచి రూ.12 వరకు పలుకుతుండటంతో.. కేవలం బహిరంగ మార్కెట్ కొనుగోళ్ల కోసమే ప్రభుత్వ ఖజానా నుంచి అదనంగా రూ.3 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాల్సి ఉంటుందని నివేదికలో అధికారులు లెక్కతేల్చారు.
నగరంలో నీటికి కటకటే..
ముంచుకొస్తున్న ఎల్‌నినో పరిస్థితుల వల్ల రాజధాని హైదరాబాద్‌లో తాగునీటి సంక్షోభం తీవ్ర రూపం దాల్చబోతోందని ఉన్నతాధికారుల నివేదిక హెచ్చరించింది. ప్రస్తుతం నగర జలాశయాలకు అందుబాటులో ఉన్న నీటి నిల్వలు మరో 80 రోజులకు మాత్రమే సరిపోతాయని, రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవకపోతే నగరంలో మునుపెన్నడూ లేని నీటి కటకట తప్పదని అంచనా వేసింది. వర్షాభావం ఇలాగే కొనసాగితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శివారు మున్సిపాలిటీలతో పాటు దాదాపు 4 లక్షల నివాసాలకు పైప్‌లైన్ల ద్వారా నీటి సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని జలమండలి వర్గాలు లెక్కగట్టాయని తెలిపింది. నాగార్జునసాగర్, ఎల్లంపల్లిలో డెడ్ స్టోరేజీలను సైతం పూర్తిగా వాడేయాల్సిన విపత్కర పరిస్థితి ఏర్పడనుందని, అదే జరిగితే ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తుందని నివేదిక పేర్కొన్నది. అంచనాల ప్రకారం ఎగువ నుంచి జలాశయాలకు ఇన్-ఫ్లో రాకపోతే, డిసెంబర్ చివరి నాటికి నగరంలో రోజు విడిచి రోజు కూడా నీళ్లివ్వలేని దయనీయ పరిస్థితి వస్తుందని హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సగటున 2 నుంచి 4 మీటర్ల మేర భూగర్భ జలమట్టాలు పడిపోగా.. రానున్న వేసవి ముగిసే నాటికి మరో 3 మీటర్ల లోతుకు పడిపోతాయని ఉన్నతాధికారులు అంచనా వేశారు. వర్షాలు సకాలంలో పడకపోతే రాష్ట్రంలోని దాదాపు 250కుపైగా మండలాలు పూర్తి డ్రై-జోన్‌లుగా మారే ముప్పు ఉందని పేర్కొన్నారు. మిషన్ భగీరథకు నీటిని సమకూర్చే నదులు, వాగుల్లో ప్రవాహం పూర్తిగా నిలిచిపోనుండటంతో గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థ దాదాపు కుదేలవుతుందని చెబుతున్నారు. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో రాబోయే రబీ సీజన్ ప్రారంభంలో కూడా సాగునీరు అందని దుస్థితి ఏర్పడనుందని అంచనా వేశారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు అట్టడుగుకు చేరుకోనుండటంతో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదని అధికారులు నివేదించారు.
రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్
ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు, ప్రజలకు తాగునీరు, విద్యుత్ కొరత రాకుండా చూసేందుకు ఇప్పటికే ప్రారంభించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సైతం నివేదికలో అధికారులు ప్రస్తావించారు. ఇందులో భాగంగా ప్రధానంగా హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జలాశయాల్లో డెడ్ స్టోరేజీల నుంచి నీటిని తోడేందుకు నాగార్జునసాగర్, ఎల్లంపల్లి వద్ద అత్యవసర పంపింగ్ మోటార్లను యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా అత్యవసర తాగునీటి నిధులను విడుదల చేయడంతోపాటు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకొని ట్యాంకర్ల ద్వారా ఉచితంగా సరఫరా చేసేలా జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు కల్పించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలను నిరోధించేందుకు వీబీ జీ రామ్ జీ (ఉపాధి హామీ) పథకం పనిదినాలను పెంచాలని కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా నిధులు సర్దుబాటు చేస్తోంది. ఎండల తీవ్రతకు పశువులు అల్లాడకుండా గ్రామాల్లో ప్రత్యేకంగా ‘పశుగ్రాస బ్యాంకులు’ (ఫాడర్ బ్యాంకులు), తాగునీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని పశుసంవర్థక శాఖను ఆదేశించింది. వ్యవసాయ రంగంలో భూగర్భ జలాల లభ్యతను బట్టి రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా ఆరుతడి, చిరుధాన్యాల పంటలు వేసేలా వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, ప్రత్యామ్నాయ విత్తనాలను సబ్సిడీపై అందుబాటులో ఉంచింది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం బహిరంగ మార్కెట్ నుంచి ఎంత ఖర్చయినా కరెంట్ కొనుగోలు చేసేందుకు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల వెసులుబాటు కల్పించిందని నివేదిక స్పష్టంచేసింది.
పెరగనున్న నిత్యావసరాల ధరలు
ఎల్‌నినో సృష్టించే తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రానున్న సీజన్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తి దారుణంగా పడిపోనుందని, ఇది రాష్ట్రంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని అనియంత్రిత స్థాయికి తీసుకెళ్తుందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. ‘‘నీటి నిల్వలు లేకపోవడంతో కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనుంది. దీని ప్రభావంతో రైతు బజార్లు, బహిరంగ మార్కెట్లకు నిత్యం వచ్చే సరఫరా నిలిచిపోయి టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి, అల్లంలాంటి ప్రాథమిక నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాన్స్‌లర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదికల ప్రకారం జాతీయ సగటు కంటే తెలంగాణలోనే రిటైల్ ద్రవ్యోల్బణం 6.27శాతం అత్యధికంగా నమోదవుతున్నది. ఈ ఎల్‌నినో నష్టం తోడైతే మార్కెట్లో కూరగాయల ధరలు మరింత మండిపోతాయి” అని స్పష్టం చేశారు. మరోవైపు వర్షాభావం, జలాశయాల్లో నీరు అట్టడుగుకు చేరడం వల్ల ఆహార ధాన్యాలు, పప్పుదినుసుల దిగుబడులు ఏకంగా 30 నుంచి 40 శాతం మేర పడిపోవచ్చని వ్యవసాయ నిపుణులు లెక్కగట్టారు. ముఖ్యంగా కందిపప్పు, మినపపప్పు, పెసర్లు, సన్న బియ్యం ఉత్పత్తి తగ్గిపోవడంతో బహిరంగ మార్కెట్‌లో వీటి ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను దాటిపోనున్నట్టు అంచనా వేశారు. అంతేకాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి, పశుగ్రాసం (పచ్చిగడ్డి) దొరక్కపోవడం, వేసవిని మించిన ఉష్ణోగ్రతల తీవ్రత వల్ల పాడి పశువుల్లో పాల ఉత్పత్తి దాదాపు 20 నుంచి 25 శాతం వరకు తగ్గిపోయే ముప్పు పొంచి ఉందని తేల్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర పాల కొరత ఏర్పడి, లీటరు పాల ధరపై అదనంగా రూ.5 ఆపైన భారం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
సుదీర్ఘంగా ఎల్‌నినో ఎఫెక్ట్
ఎల్‌నినో ఎఫెక్ట్ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తుండటంతో పల్లెల్లో ఉపాధి సంక్షోభం ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. పొలాలు బీడువారడం, చెరువులు ఎండిపోవడంతో వ్యవసాయ పనులు దొరకని దయనీయ పరిస్థితులు ఎదురుకానున్నాయని పేర్కొన్నది. దీంతో మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాది కుటుంబాలు జీవనోపాధి కోసం హైదరాబాద్‌లాంటి నగరాలకు వలస బాట పట్టక తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. వలసల నివారణకు ఉపాధి పనులను పెంచేలా సర్కార్ సిద్ధమైంది. పని దినాలు పెంచాలని కేంద్రానికి లేఖ రాసింది.
ఎల్‌నినో వల్ల వర్షాభావం ఏర్పడి పంటలు ఎండిపోతే, గ్రామీణ ప్రజల చేతుల్లో డబ్బు మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. చేతిలో డబ్బు లేకపోవడంతో గ్రామీణ కొనుగోలు శక్తి కుప్పకూలుతుంది. దీని ప్రభావంతో రైతులు కొత్తగా ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు కొనడం ఆపేస్తారు. పల్లెల్లో బైకులు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు.. చివరికి కన్స్యూమర్ గూడ్స్ అమ్మకాలు సైతం 30 నుంచి 40 శాతం పడిపోయే ప్రమాదం ఉంది
