చైనాకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ సరికొత్త ప్రయోగంతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అచ్చం సినిమాల్లో చూపించే UFO అదేనండి ఫ్లయింగ్ సాసర్ ఆకారంలో ఉండే ప్రయాణీకుల విమానాన్ని తయారు చేసి అమ్ముతోంది. దీనిని eVTOL (Electric Vertical Takeoff and Landing) విమానంగా పిలుస్తున్నారు. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని యివు గ్లోబల్ డిజిటల్ ట్రేడ్ సెంటర్‌లో ప్రదర్శనకు ఉంచిన ఈ వింత విమానాన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. ప్రస్తుతం ఈ ఫ్లయింగ్ సాసర్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మ్యాన్డ్ ఈవీటీఓఎల్ ఎయిర్‌క్రాఫ్ట్ ను ఎస్‌ఎండీ షెంజెన్ స్మార్ట్ డ్రోన్ యూఏవీ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ విమానం డిస్క్ ఆకారంలో ఉండే బాడీని కలిగి ఉండగా.. లోపల 360-డిగ్రీల కోణంలో పూర్తిగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే స్ఫెరికల్ క్యాబిన్‌ను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణంలో ఫైబర్‌గ్లాస్, కార్బన్ ఫైబర్, అల్యూమినియం అల్లాయ్, ఏవియేషన్-గ్రేడ్ లామినేట్లను ఉపయోగించారు. ఈ విమానంలో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉంది.
ఈ ఫ్లయింగ్ సాసర్ ప్రత్యేకత ఏమిటంటే దీనికి రన్‌వే అవసరం ఉండదు. నిలువుగా గాల్లోకి టేకాఫ్ అయి, ల్యాండ్ అవగలదు. అంతేకాకుండా నీటి మీద కూడా సులభంగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలగడం దీని ప్రధాన విశేషం. ఇది బలమైన ఈదురు గాలలను కూడా తట్టుకోగలదట. అయితే ఇది అతి ఎత్తులో ప్రయాణించలేదు. గరిష్టంగా దాదాపు 100 అడుగుల ఎత్తు వరకు మాత్రమే చేరుకోగలదు. దీనివల్ల దీనిని ప్రధానంగా తక్కువ ఎత్తులో చేసే పర్యాటక ప్రదేశాల చూడటం, ఇతర వినోద కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించవచ్చు. ఇది గాలిలో కేవలం 15 నిమిషాలు మాత్రమే నిరంతరం ప్రయాణించగలదు. ఇందులో ఆరు రోటర్లతో కూడిన డక్టెడ్ డిజైన్‌ను ఇచ్చారు, దీనివల్ల ప్రొపెల్లర్లు పూర్తిగా ఫ్యూజ్‌లేజ్ లోపల దాగి ఉంటాయి.
చైనా పౌర విమానయాన శాఖ నుంచి ఈ సివిల్ అన్‌మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రత్యేక విమాన అనుమతిని కూడా పొందిందని సంస్థ షోరూమ్ హెడ్ హువాంగ్ యాంగ్ తెలిపారు. ఈ ఫ్లయింగ్ సాసర్ ధర సుమారు రూ. 93 లక్షల నుంచి రూ.కోటి 10లక్షల వరకు ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో యివు సెంటర్‌కు మారిన ఈ కంపెనీ వద్ద ప్రస్తుతం దేశీయ, విదేశీ కొనుగోలుదారులు భారీగా క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఈ వింత విమానానికి సంబంధించి దాదాపు రూ.171 కోట్ల విలువైన ఆర్డర్లు కూడా వచ్చాయని కంపెనీ చెబుతోంది.
