ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం కింద అందే LPG సబ్సిడీ ప్రయోజనం కొనసాగాలంటే.. ఆగస్టు 16 లోగా ఈ--కేవైసీని పూర్తి చేసుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు LPG వినియోగదారులకు కీలక హెచ్చరిక చేశాయి. ఇండియన్ ఆయిల్, BPCL రెండూ తమ వినియోగదారులు ఇంకా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ--కేవైసీని పూర్తి చేయకపోతే.. పూర్తి చేయాలని స్పష్టం చేశాయి. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే.. సబ్సిడీ గృహ LPG సిలిండర్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఆగస్ట్ 16 లోపు ఈ-కేవైసీ చేయకపోతే.. ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, HP గ్యాస్ సిలిండర్లకు ఎక్కువ ధర చెల్లించక తప్పదు.
ఇండియన్ ఆయిల్ ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు సందేశం ఇలా పంపింది. "ప్రియమైన వినియోగదారులారా, సబ్సిడీ ధరలకు ఎల్పీజీ సిలిండర్లను పొందడానికి ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయవలసి ఉంటుంది. ఇంతకుముందు గుర్తు చేసినప్పటికీ, మీరు ఇప్పటివరకు మీ ఈ-కేవైసీని పూర్తి చేయలేదు.
మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ఇండియన్‌ఆయిల్ వన్ యాప్ ద్వారా గానీ, మీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి గానీ, లేదా డెలివరీ సిబ్బంది ద్వారా గానీ ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు. 16.08.26 లోగా ఈ-కేవైసీని పూర్తి చేయడంలో ఫెయిల్ అయితే.. అది పూర్తయ్యే వరకు మీరు గృహ వినియోగ ధరలకు సిలిండర్లను పొందేందుకు అనర్హులు అవుతారు. దయచేసి వీలైనంత త్వరగా మీ ఈ-కేవైసీని పూర్తి చేయండి."
PMUY పథకం కింద వినియోగదారులకు మార్చి 2026 నుంచి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ--కేవైసీ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మీరు ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసి ఉంటే అవసరం లేదు. ఇప్పటివరకు ఈ--కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ఇది తప్పనిసరి అని చమురు మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎల్పీజీ సబ్సిడీలో భాగంగా పీఎంయూవై లబ్ధిదారులకు రెండు ప్రధాన ప్రయోజనాలు అందుతున్నాయి.
అందులో.. మొదటిది, అర్హత ఉన్న పీఎంయూవై కుటుంబాలకు ప్రతి 14.2 కేజీల సిలిండర్పై రూ. 300 సబ్సిడీ లభిస్తుంది. ఈ సంవత్సరం.. ప్రభుత్వం ఎల్పీజీ సబ్సిడీని గతంలో ఉన్న 9 రీఫిల్స్ నుంచి సంవత్సరానికి 4 రీఫిల్స్కు తగ్గించింది. ఈ-కేవైసీని పూర్తి చేయకపోతే.. ఉజ్వల గ్యాస్ వినియోగదారులు కూడా.. 14.2 కేజీల LPG సిలిండర్లపై మార్కెట్ ధర చెల్లించక తప్పదు.
