- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలి
సుజాతనగర్, వెలుగు : పోడు భూములపై త్వరలోనే తీపి కబురు చెబుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అటవీ భూములకు సంబంధించిన కొన్ని అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నందున.. కేంద్రంతో సంప్రదించి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధికి అధిక నిధులు కేటాయించి అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు.
అర్హులైన పేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి రూ.500 బోనస్, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఖమ్మం, -నల్గొండ, -వరంగల్ గ్రాడ్యుయేట్‌ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన గ్రాడ్యుయేట్ల ఓటరు నమోదును స్పీడ్ గా చేయాలని సూచించారు.
అంతకుముందు ఖమ్మంలోని మంత్రి క్యాంప్ ఆఫీసులో ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఆర్థికంగా అండగా నిలుస్తోందని మంత్రి చెప్పారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
