ముంబైలో థాక్రే బ్రదర్స్ ర్యాలీ ..సర్ రద్దు చేయాలి.. జ్ఞానేశ్ రాజీనామా చేయాలని డిమాండ్

ముంబైలో థాక్రే బ్రదర్స్ ర్యాలీ ..సర్ రద్దు చేయాలి.. జ్ఞానేశ్ రాజీనామా చేయాలని డిమాండ్

ముంబై: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే ఆదివారం ముంబైలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

దక్షిణ ముంబైలోని మెట్రో సినిమా నుంచి ప్రారంభమైన ఈ ‘విరాట్ గర్జన మోర్చా’ బృహన్‌‌‌‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) హెడ్డాఫీసు వరకు సాగింది. ఈ ప్రదర్శనలో కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) నేతలు కూడా పాల్గొని మద్దతు తెలిపారు.

బ్యాలెట్ పేపర్లను తేవాలి: రాజ్ థాక్రే

జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారని, ఎస్‌‌‌‌ఐఆర్ (సర్) ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని ఇరు నేతలు డిమాండ్ చేశారు. ‘మహారాష్ట్రలో ఎస్‌‌‌‌ఐఆర్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలి. దేశంలో తిరిగి బ్యాలెట్ పేపర్ పద్ధతిని తీసుకురావాలి’ అని రాజ్ థాక్రే పేర్కొన్నారు. ఓటర్ల తొలగింపును ప్రస్తావిస్తూ, ‘ఇందులో ఏదో తప్పు జరుగుతోందని నేను 2017-18 నుంచే చెబుతున్నాను. 

ఓట్ల సంఖ్య ఒక్కసారిగా ఎలా తగ్గుతుంది?’ అని ప్రశ్నించారు. ‘ఈ ప్రభుత్వం ఎలా నడుస్తోంది, ఏ మార్గాల ద్వారా నడుస్తోంది అనేదే మా ఆగ్రహానికి కారణం. అధికారంలో ఎవరు ఉండాలనేది నిర్ణయించాల్సింది ఎన్నికల సంఘం కాదు.. ప్రజలు నిర్ణయించాలి’ అని ఆయన స్పష్టం చేశారు. 
 

ప్రజల ఓటు హక్కును హరించారు: ఉద్ధవ్ థాక్రే


జ్ఞానేశ్ కుమార్ ప్రజల ఓటు హక్కును ‘లాక్కున్నారని’ ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా ఆరోపించారు. ‘ఓటర్ల జాబితా నుంచి బంగ్లాదేశీలను తొలగించడమే ఎస్‌‌‌‌ఐఆర్ ప్రధాన ఉద్దేశం అయితే, ఇప్పటి వరకు మీకు ఎంతమంది బంగ్లాదేశీయులు దొరికారు?’ అని ఆయన నిలదీశారు. 

సీజేపీ ఆధ్వర్యంలో ముంబైలోని శివాజీ పార్కులో సీఈసీకి వ్యతిరేకంగా ‘జైల్ భరో ఆందోళన’ జరిగిన రెండు రోజులకే ఈ మార్చ్ నిర్వహించడం గమనార్హం. కాగా, మహారాష్ట్రలో నిర్వహించిన ఎస్‌‌‌‌ఐఆర్ కారణంగా రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి సుమారు 2.06 కోట్లకు పైగా ఓటర్లు గల్లంతయ్యారు.