రష్యానే మనకు అండ.. దౌత్య మార్గాల ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలి

రష్యానే మనకు అండ.. దౌత్య మార్గాల ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలి
  •    కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 

న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పు వాటిల్లిన క్లిష్ట సమయాల్లో ప్రపంచమంతా పాకిస్తాన్‌‌‌‌కు మద్దతుగా నిలిచినా, రష్యా మాత్రం భారత్‌‌‌‌కు అండగా నిలబడిందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌‌‌‌లో ఆయన మాట్లాడారు.

1950 నుంచి సోవియట్ యూనియన్ మన దేశానికి అందించిన మద్దతును, ముఖ్యంగా 1971 యుద్ధ సమయంలో వాషింగ్టన్ నావికాదళాన్ని పంపినప్పుడు రష్యా అండగా నిలిచిన చారిత్రక సందర్భాన్ని ఆయన గుర్తుచేశారు. యూరప్ కోణాన్ని భారత్ అలవర్చుకోవాలని ఆశించలేనట్లే, మాస్కోతో మన సుదీర్ఘ సంబంధాల ఆధారంగానే భారత్ నిర్ణయాలు ఉంటాయన్నారు. 

ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై పశ్చిమ దేశాల విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ప్రపంచ మార్కెట్లను స్థిరీకరించేందుకు తొలుత రష్యా చమురు కొనుగోలు చేయమని అమెరికా తమను ప్రోత్సహించిందని చెప్పారు. 

వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని భారత్ కోరుతోందని, ‘ఇది యుద్ధ యుగం కాదు’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారని జైశంకర్ పునరుద్ఘాటించారు.