లక్షలాది ఓట్ల తొలగింపు రాజ్యాంగ విరుద్ధం: సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్

లక్షలాది ఓట్ల తొలగింపు  రాజ్యాంగ విరుద్ధం: సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్
  • పౌరుల నుంచి ఓటును వేరుచేయడం దేహం నుంచి ప్రాణం తీయడమే
  • లక్షలాది మందిని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చడమే
  • దాన్ని ఏ కుంటిసాకులూ సమర్థించలేవు
  • ఏ వ్యవస్థకూ ఆ అధికారం లేదు
  • ఓటు హక్కు రాజ్యాంగ బేసిక్‌‌‌‌ స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌లో భాగం
  • రాజ్యాంగంలో రెండు రకాల పౌరసత్వాలు లేవు
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్  
  • నల్సార్‌‌‌‌ వర్సిటీ కార్యక్రమంలో కామెంట్స్​

హైదరాబాద్, వెలుగు: లక్షలాది మంది భారతీయ పౌరుల ఓటు హక్కును కాలరాసే ఏ చర్యనైనా రాజ్యాంగ వ్యవస్థపై దాడిగా, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కడం గానే పరిగణించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌ భూయాన్‌‌‌‌ అన్నారు. ‘‘ఓటు హక్కు ఉన్నవారు, ఓటు హక్కు లేనివారు అంటూ రెండు వర్గాల పౌరులను భారత రాజ్యాంగం సృష్టించలేదు. ఏ అధికార వ్యవస్థకూ పౌరుల ఓటు హక్కును హరించే అధికారం లేదు. ఏ న్యాయస్థానమూ దీన్ని సమర్థించలేదు”  అని వ్యాఖ్యానించారు.

ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం నెలకొన్న వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హైదరాబాద్‌‌‌‌లోని నల్సార్‌‌‌‌ న్యాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన ‘19వ జస్టిస్‌‌‌‌ బి.ఆర్‌‌‌‌. సాహ్నే మెమోరియల్‌‌‌‌ మూట్‌‌‌‌ కోర్టు’ పోటీల ముగింపు సభలో జస్టిస్‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌ భుయాన్‌‌‌‌ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. 

పౌరుడి నుంచి ఓటు హక్కును వేరు చేయలేమని స్పష్టం చేశారు.  ‘‘భారతీయ పౌరుడి నుంచి ఓటు హక్కును లేదా ఓటర్ల జాబితాలో ఉండే హక్కును తీసివేయడం అంటే దేహం నుంచి ఆత్మను వేరు చేయడమే” అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించకపోయినా, అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కుగా పరిగణించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఓటు హక్కు రాజ్యాంగ ‘మౌలిక స్వరూపం’ (బేసిక్‌‌ స్ట్రక్చర్‌‌) లోనే అత్యంత కీలకమైన భాగమని ఆయన అభిప్రాయపడ్డారు.

కోటీశ్వరుడైనా.. రిక్షా కార్మికుడైనా ఒక్కటే !
స్వాతంత్య్ర పోరాటం, త్యాగాల పునాదులపైనే పౌరుడి ఓటు హక్కు ఆవిర్భవించిందని జస్టిస్ భుయాన్ గుర్తుచేశారు. రాజ్యాంగ నిర్మాతలు సామాన్య మానవుడిపై ఉంచిన అచంచల విశ్వాసానికి సార్వత్రిక వయోజన ఓటు హక్కే నిదర్శనమని పేర్కొన్నారు.‘‘ఒకరు బిలియనీర్‌‌‌‌ కావచ్చు.. మరొకరు నిరుపేద రిక్షా కార్మికుడు కావచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఇద్దరి ఓట్ల విలువా ఒక్కటే’’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత పదవి రాష్ట్రపతిది కాదని, ఒక సామాన్య పౌరుడిదేనన్న ప్రముఖ న్యాయకోవిదుల మాటలను ఆయన  ప్రస్తావించారు. 

సీఈసీ నైతిక హక్కు కోల్పోయారు: కాంగ్రెస్ ఫైర్‌‌‌‌
సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌‌ కుమార్‌‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో సీఈసీ ముసుగు పూర్తిగా తొలగిపోయిందని ఎద్దేవా చేశారు.

‘‘ఓటు హక్కు రాజ్యాంగ మూలతత్వంలో అంతర్భాగమని ఒక సిట్టింగ్ జడ్జి అత్యంత సాహసోపేతంగా స్పష్టం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న సీఈసీ స్వయంగా రాజ్యాంగ స్ఫూర్తిని, నిబంధనలను ఉల్లంఘించారని నిరూపితమైంది. జ్ఞానేశ్‌‌ కుమార్ అన్ని విధాలా ఎక్స్‌‌పోజ్ అయ్యారు. ఆయన తన పదవిలో కొనసాగే కనీస నైతిక హక్కును కోల్పోయారు’’ అని జైరాం రమేశ్ మండిపడ్డారు. తక్షణమే ఆయన పదవి నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. 

కోట్ల మంది పౌరుల ఓటు హక్కులను హరిస్తూ వారిని సొంత దేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చే ఎలాంటి చర్యలైనా ఏకపక్షమే. ఇలాంటి విధానాలు సమానత్వ హక్కును ప్రసాదించే ఆర్టికల్‌‌‌‌ 14కు, సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించే ఆర్టికల్‌‌‌‌ 326కు పూర్తి విరుద్ధం. ఎలాంటి డొంకతిరుగుడు వాదనలూ దీన్ని సమర్థించలేవు. వ్యక్తి మరణిస్తే తప్ప.. ఒక్కసారి ఓటరుగా నమోదైన పౌరుడి పేరును ముందస్తు నోటీసు ఇవ్వకుండా, వారి వివరణ వినకుండా జాబితా నుంచి తొలగించడానికి వీల్లేదు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ​ఉజ్జల్‌‌‌‌ భుయాన్‌‌‌‌