- ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో బయటపడ్డ అక్రమాలు
- పోలీసు శాఖలోనే అత్యధికంగా 17 మందికి డబుల్ శాలరీలు
- రికవరీ చేసి.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు
- సత్వరమే చర్యల నివేదిక సమర్పించాలని సర్క్యులర్ జారీ
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక శాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా చేపట్టిన ఉద్యోగుల డేటా పరిశీలనలో అనేక దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. ఒకే ఆధారిత ఐడెంటిటీ ద్వారా వేర్వేరు ప్రభుత్వ శాఖల నుంచి ఇద్దరు వ్యక్తులు లేదా ఒకే వ్యక్తి రెండుచోట్ల అక్రమంగా వేతనాలు పొందుతున్నట్టు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. పాఠశాల విద్య, పంచాయతీ రాజ్, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖల పరిధిలో 40 మంది అక్రమంగా రెండేసి జీతాలు తీసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ తీవ్రమైన ఆర్థిక అక్రమాలపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ సర్క్యులర్ విడుదల చేసింది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అక్రమంగా జీతాలు కాజేసిన వారిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజూ అన్ని శాఖాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
తప్పుడు సమాచారం ఇవ్వడం, అసలు విషయాలను దాచిపెట్టడం, ఫోర్జరీ చేసి ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991 ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అక్రమంగా పొందిన జీతం మొత్తాన్ని వడ్డీతో సహా రికవరీ చేయాలని, బాధ్యులైన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఉల్లంఘనలను ప్రభుత్వం అత్యంత తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణిస్తూ, చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు (డీడీఓ) ఆదేశాలు పంపింది.
చీటింగ్, నిధుల మళ్లింపు, ప్రభుత్వ రికార్డుల నమోదులో అక్రమాలకు పాల్పడిన వారిపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆయా శాఖల్లో నమోదైన అక్రమ కేసులు, రికవరీ చేసిన మొత్తం వివరాలను తెలుపుతూ సమగ్ర చర్యల నివేదికను (ఏటీఆర్) సత్వరమే సమర్పించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అక్రమాలకు సహకరించిన సీనియర్ అధికారులపై కూడా పక్కాగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ మేరకు ఒకే ఆధారిత మ్యాపింగ్ లేదా వేర్వేరు ఉద్యోగి కోడ్‌లతో ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ తో అక్రమంగా వేతనాలు పొందుతున్న ఉద్యోగుల జాబితాను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా పోలీసు శాఖ (డీజీపీ కార్యాలయం) పరిధిలోనే 17 మంది అక్రమంగా రెండేసీ జీతాలు తీసుకుంటున్న కేసులు నమోదయ్యాయి.
