జీతాలు, పింఛన్లకే ఖజానా ఖాళీ.. 5 నెలల్లోనే 59 శాతం అప్పులు.. ‘కాగ్‌‌‌‌’ తాజా నివేదికలో వెల్లడి

జీతాలు, పింఛన్లకే ఖజానా ఖాళీ.. 5 నెలల్లోనే 59 శాతం అప్పులు.. ‘కాగ్‌‌‌‌’ తాజా నివేదికలో వెల్లడి
  • ఆదాయంలో సింహ భాగం ఉద్యోగుల నిర్వహణకే..
  • తొలి 5 నెలల్లో రూ.34  వేల కోట్లు ఖర్చు
  • 14,840 కోట్ల రెవెన్యూ లోటు, 34,285 కోట్ల అప్పులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులు భారంగా మారాయి. ఆదాయంలో సింహభాగం ఉద్యోగుల నిర్వహణ వ్యయానికే సరిపోతుండడంతో అభివృద్ధి పనులు పడకేస్తున్నాయి. ఈ విషయం కంప్ట్రోలర్‌‌‌‌ అండ్‌‌‌‌ ఆడిటర్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా (కాగ్‌‌‌‌) తాజా నివేదికలో వెల్లడైంది.

ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు కలిపి ఏప్రిల్​ నుంచి తొలి 5 నెలల్లోనే (ఆగస్టు నాటికి) రూ.34 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇందులో జీతాల రూపంలో రూ.21,536.49 కోట్లు, పింఛన్లకు రూ.12,487 కోట్లు చెల్లించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్‌‌‌‌ సిబ్బంది పింఛన్ల కోసమే ప్రభుత్వం సగటున ప్రతి నెలా ఏకంగా రూ.6,600 కోట్ల మేర నిధులను ఖర్చు చేస్తున్నది.

రాష్ట్ర ఖజానా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.14,840 కోట్ల రెవెన్యూ లోటుతో, రూ.34,285 కోట్ల అప్పులతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ ప్రభుత్వం ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తోంది. ఇలాంటి  క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన కరువు భత్యం(డీఏ) అంశం వచ్చిపడింది. 

వరుసగా ఆరు డీఏలు పెండింగ్‌‌‌‌లో పడిపోవడంతో ఉద్యోగ సంఘాల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటుండగా, వీటిని విడుదల చేస్తే ఖజానా మరింత దివాళా తీస్తుందనే ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

రెండు డీఏలు ఇస్తే రూ.7,644 కోట్ల భారం..
ఆరు డీఏలను ఒకేసారి విడుదల చేయడం అసాధ్య కావడంతో ఉద్యోగులను సంతృప్తిపరిచేందుకు కనీసం ఒకటి లేదా రెండు డీఏలైనా ఇచ్చే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఈ లెక్కన వరుసగా రెండు డీఏలను ప్రభుత్వం మంజూరు చేస్తే.. 2024 జనవరికి చెందిన 3.64 శాతం, 2024 జులైకి చెందిన 2.73 శాతం డీఏలను అమలు చేయాల్సి ఉంటుంది. 

కేవలం ఈ రెండు డీఏలను విడుదల చేసినా ప్రభుత్వ ఖజానాపై నెలకు దాదాపు రూ.637 కోట్లు, ఏడాదికి సుమారు రూ.7,644 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడనుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది.

సర్కార్​రెండు డీఏల సర్దుబాటుపై ఆలోచిస్తుంటే, ఉద్యోగ సంఘాలు మాత్రం మూడు డీఏలు కలిపి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాయి. మూడో డీఏ అయిన 2025 జనవరి పెంపు కేవలం 1.82 శాతం మాత్రమేనని, దీనివల్ల ఖజానాపై పడే అదనపు భారం నెలకు రూ.182 కోట్లేనని సంఘాలు చెబుతున్నాయి. కానీ ఈ మూడు డీఏలను కలిపి మొత్తం 8.19 శాతం ఒకేసారి మంజూరు చేస్తే ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల చొప్పున ఏడాదికి ఏకంగా రూ.9,828 కోట్ల వరకు భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తున్నది. 

5 నెలల్లోనే 59 శాతం అప్పులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రుణాల పరిమితిని ప్రభుత్వం తొలి 5 నెలల్లోనే దాదాపు 59 శాతం మేర వాడేసుకున్నది. ఏడాది మొత్తానికి రూ.58,458 కోట్ల నికర అప్పులు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆగస్టు నెలాఖరుకే ఏకంగా రూ.34,285 కోట్ల రుణాలు సేకరించడం ఆర్థిక ఒత్తిడి తీవ్రతను స్పష్టం చేస్తున్నది. బడ్జెట్‌‌‌‌ అంచనాల్లో రూ.6,857 కోట్ల మిగులు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది.

ఆగస్టు ముగిసే సమయానికి రాష్ట్ర ఖజానా ఏకంగా రూ.14,840 కోట్ల రెవెన్యూ లోటుతో -216.41 శాతంతో కొట్టుమిట్టాడుతున్నది. ఇదే సమయంలో ద్రవ్య లోటు రూ.34,285 కోట్లకు, ప్రాథమిక లోటు రూ.21,110 కోట్లకు ఎగబాకాయి.  మొత్తం రూ.1,11,840 కోట్ల రాబడుల్లో మూడో వంతుకు పైగా అప్పుల ద్వారా సమకూరినవే. ప్రభుత్వ వ్యయాల తీరును పరిశీలిస్తే అభివృద్ధి పనుల కంటే నిర్వహణ ఖర్చులకే నిధులు ఎగరేసుకుపోతున్న వైనం స్పష్టమవుతున్నది.

5 నెలల్లో మొత్తం రెవెన్యూ వ్యయం రూ.92,376.70 కోట్లు(39.41 శాతం) కాగా, ఇందులో సింహభాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీలకే సరిపోయింది. పాత రుణాల వడ్డీలకు రూ.13,174.49 కోట్లు చెల్లించారు. సబ్సిడీల కింద రూ.9,276.98 కోట్లు ఖర్చు చేశారు. దీనికి భిన్నంగా మూలధన వ్యయం (క్యాపిటల్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పెండిచర్‌‌‌‌) ఘోరంగా పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి మూలధన వ్యయం 39.28 శాతం ఉండగా, ఈసారి కేవలం 26.26 శాతానికే పరిమితమై రూ.12,412 కోట్లుగా ఉంది.

పన్నేతర ఆదాయం, కేంద్ర గ్రాంట్లలోనూ నిరాశ..
ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకున్న పన్నేతర రాబడిలో కనీస పురోగతి కనిపించడం లేదు. అటు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్‌‌‌‌-ఇన్‌‌‌‌-ఎయిడ్‌‌‌‌ నిధుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నాన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ రెవెన్యూ ఏడాదికి రూ.35,730 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఆగస్టు నాటికి వచ్చింది కేవలం రూ.5,475 కోట్లు(15.32 శాతం) మాత్రమే. ఇక బడ్జెట్‌‌‌‌లో కేంద్రం నుంచి గ్రాంట్‌‌‌‌ ఇన్‌‌‌‌ ఎయిడ్‌‌‌‌ రూ.24,166 కోట్లు అంచనా వేయగా.. అందింది రూ.2,962 కోట్లు(12.26 శాతం) మాత్రమే.

ఇక ప్రభుత్వ ఖజానాకు పన్నుల రాబడి మాత్రమే కొంత ఊరటనిస్తున్నది. పన్నుల ద్వారా రూ.69,097.42 కోట్లు(38.10 శాతం) రాగా, అందులో ప్రధానంగా జీఎస్టీ ద్వారా రూ.24,750 కోట్లు, సేల్స్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌తో రూ.15,779 కోట్లు వసూలయ్యాయి. స్టాంపులు–రిజిస్ట్రేషన్లతో రూ.7,574 కోట్లు, ఎక్సైజ్‌‌‌‌ శాఖ నుంచి రూ.8,535 కోట్లు, కేంద్ర పన్నుల వాటాగా రూ.8,945 కోట్లు జమయ్యాయి.

కాగ్‌‌‌‌కు చేరని ప్రభుత్వ గ్యారెంటీల లెక్కలు..
రంగాలవారీ ఖర్చులను లెక్కిస్తే సంక్షేమం, ఆర్థిక వ్యవస్థల మధ్య బ్యాలెన్స్‌‌‌‌ లోపించినట్టు కాగ్‌‌‌‌ గణాంకాలు చెబుతున్నాయి. జనరల్‌‌‌‌ సెక్టార్‌‌‌‌కే బడ్జెట్‌‌‌‌ అంచనాల్లో 58.04 శాతం (రూ.32,645 కోట్లు) ఖర్చు కాగా, ప్రజారోగ్యం, విద్యలాంటి సామాజిక రంగానికి 31.36 శాతం (రూ.39,283.12 కోట్లు) మాత్రమే దక్కింది. 

ఆర్థికాభివృద్ధిని నిర్దేశించే ఎకనామిక్‌‌‌‌ సెక్టార్‌‌‌‌లో మూలధన వ్యయం నిరుడు 51.20 శాతం ఉండగా, ఈసారి అది 30.06 శాతానికి దిగజారడం ఆందోళన కలిగిస్తున్నది. ఆగస్టు 31 నాటికి వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన ప్రభుత్వ గ్యారంటీలు, పబ్లిక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ నుంచి సేకరించిన రుణాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కాగ్​ఆఫీసుకు సమర్పించకపోవడం గమనార్హం.

ఖజానాపై పీఆర్సీ పిడుగు..
ఇప్పటికే పదవీ విరమణ పొందిన ఉద్యోగుల రిటైర్మెంట్‌‌‌‌ బెనిఫిట్స్‌‌‌‌ కింద గత 100 రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.6వేల కోట్ల పాత బకాయిలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన విడుదల చేసింది. ఇవి కాకుండా మిగిలిన మొత్తం కోసం కూడా ప్రతి నెలా మరో రూ.750 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు ఖజానా నుంచి ప్రత్యేకంగా చెల్లింపులు చేస్తున్నది. ఒకవైపు ప్రతి నెలా మొదటి తేదీనే జీతాలు ఇవ్వడం, మరోవైపు వేల కోట్ల రిటైర్మెంట్‌‌‌‌ బకాయిలు చెల్లిస్తుండటంతో నిధుల సర్దుబాటు ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది.

దీనికి తోడు ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నూతన పీఆర్సీని త్వరలోనే ప్రకటిస్తే.. ఆ మొత్తం కూడా మరింత పెరిగి ప్రభుత్వ ఖజానాపై భారం పడనుంది. ఇప్పటికే వేతనాల వ్యయం అదుపు తప్పుతున్న తరుణంలో.. ఇప్పుడు కొత్తగా డీఏల భారాన్ని ఎలా మోయాలనే దానిపైనే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర తర్జనభర్జన పడుతున్నది.