తెలంగాణలో ఇప్పుడు ఏ ఊర్లో చూసినా ఒకటే పరిస్థితి కనిపిస్తోంది. పొద్దున్నే ఒక పిల్లవాడు టై, బూట్లు వేసుకొని ప్రైవేట్ స్కూల్ బస్సు ఎక్కుతాడు, అదే వీధిలో ఇంకో పిల్లవాడు పాత బ్యాగుతో ప్రభుత్వ బడికి నడుచుకుంటూ పోతాడు. ఇద్దరూ ఒకే రాష్ట్రం పిల్లలే, ఒకే వయసు వాళ్లే. కానీ వాళ్ల చదువుల మధ్య చాలా తేడా వచ్చేసింది.
ఇది ఒక్క ఊరి సమస్య కాదు, రాష్ట్రం మొత్తం ఉన్న సమస్య. వాస్తవానికి సమానత్వం అంటే... పేదోడి బిడ్డ, పెద్దోడి బిడ్డ ఒకే బెంచీపై కూర్చుని ఒకే పాఠం చదవడం!. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఫీజుల గురించే మాట్లాడుకుంటున్నారు.
నగరంలో ఎల్‌కేజీకే లక్ష రూపాయల ఫీజు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి.
పుస్తకాలు, బస్సు, యూనిఫాం అంటూ ఇంకో యాభై వేలు అదనం. పల్లెటూర్లలో, చిన్న పట్టణాల్లో కూడా ముప్పై వేల నుంచి అరవై వేల దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రతి ఏటా పది శాతం, ఇరవై శాతం అని ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు.
ఒక రైతు, ఒక ఆటో డ్రైవర్, ఒక చిన్న దుకాణం నడిపేవాడు తన పిల్లల ఫీజు కోసం ప్రతి ఏటా అప్పు చేయాల్సి వస్తోంది. ఫీజు కట్టకపోతే పిల్లల్ని క్లాసు బయట నిలబెడుతున్నారనే బాధ ఎంతోమంది తల్లిదండ్రుల్లో ఉంది.
ప్రభుత్వ బడిపై చిన్నచూపు
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి ప్రైవేట్ స్కూలు తమ ఫీజుల వివరాలను బోర్డు మీద రాయాలని, వెబ్‌సైట్‌లో పెట్టాలని, రెండేళ్లకు ఒకసారి ఎనిమిది శాతం కంటే ఎక్కువ పెంచితే అనుమతి తీసుకోవాలని, దీనికోసం ప్రత్యేక కమిషన్ పెట్టాలని, కొత్త బిల్లు తేవాలని భావిస్తోంది. ఇది మంచి ఆలోచనే. కానీ దీంతోనే అంతా సర్దుకుంటుందా అంటే కష్టమే. నిజానికి అసలు లోపం ఇంకోచోట ఉంది.
మన ప్రభుత్వ బడులు బలహీనపడిపోవడం. గత పదేళ్లలో మనమే ప్రభుత్వ బడిని చిన్నచూపు చూశాం అనే నిజాన్ని ఒప్పుకోవాలి. రాష్ట్రంలో చాలాచోట్ల ఇప్పటికీ ఒకే టీచర్‌తో మూడు క్లాసులు నడుస్తున్నాయి, స్కూలు బిల్డింగులు శిథిలమై, టాయిలెట్లు సరిగా లేక, కంప్యూటర్ ఉన్నా వాడేవాళ్లు లేక ప్రభుత్వ బడులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఇంగ్లిష్ రావాలని కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వ బడిలో ఇంగ్లిష్, సైన్స్ సరిగా బోధించే టీచర్లు, సైన్స్ ల్యాబ్‌లు లేవు. దాంతో పేదవారు కూడా ఎట్లాగైనా, చివరికి అప్పుచేసి అయినా తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్‌కి పంపాలని నిర్ణయించుకుంటున్నారు. ఇది వారిపాలిట బలవంతపు పరిస్థితి అయిపోయింది.
సమానత్వం అంటే ఏమిటి?
వాస్తవానికి అందరికీ ప్రభుత్వ స్కూల్లో సీటు ఇవ్వడమే సమానత్వం కాదు. పెద్ద ఉద్యోగం చేసేవాడి కొడుకు, రోజు కూలి చేసుకునేవాడి కొడుకు ఒకే బెంచీ మీద కూర్చొని ఒకేలా నాణ్యమైన విద్యను పొందే పరిస్థితి రావాలి. మెరుగైన చదువు, ధైర్యంగా ఇంగ్లిష్‌లో మాట్లాడడం, కంప్యూటర్ నేర్చుకోవడం, అదీ సమానత్వం.
ప్రైవేట్ స్కూల్‌లో చదివినోడు రోబోటిక్స్ నేర్చుకుని, ప్రభుత్వ బడిలో చదివినోడు అక్షరాలు కూడా సరిగా రాకపోతే దాన్ని సమానత్వం అనలేం. అందుకే ఫీజు కంట్రోల్‌తోపాటు ప్రభుత్వ బడిని విద్యాపరంగా బలోపేతం చేయడమే ప్రధాన కర్తవ్యం. స్కూలు బిల్డింగ్ కట్టితేనే సరిపోదు. ఇప్పుడు ప్రభుత్వం మన ఊరు మన బడి అని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, అమ్మ ఆదర్శ స్కూల్స్ అని రాష్ట్రం మొత్తం కొత్త బడులు కడుతోంది, మంచిదే. కానీ దానితోపాటు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు వెంటనే నింపాలి, వాళ్లకు మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రైవేట్ టీచర్ కంటే ప్రభుత్వ టీచర్ తక్కువ కాదు అనే నమ్మకం రావాలి.
నాణ్యమైన విద్య అందరికీ దక్కాల్సిన హక్కు
ప్రతి బడికి ఉండే తల్లిదండ్రుల కమిటీ నామమాత్రంగా కాకుండా చిత్తశుద్ధితో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేందుకు కృషి చేయాలి. నా బడి బాగుంటే నా ఊరు బాగుంటుంది అనే ఫీలింగ్ తేవాలి.
పదో తరగతి వరకు చదివి కూడా ఏ పని రాకపోతే లాభం లేదు. అందుకే బడిలోనే కంప్యూటర్, చిన్న చిన్న చేతి పనులు లాంటి స్కిల్స్ నేర్పిస్తే పిల్లవాడు వెంటనే నిలబడతాడు. చివరగా ఒక మాట. ఫీజు నియంత్రణ వల్ల ప్రైవేట్ స్కూల్స్‌వాళ్లు కొంత భయపడతారు. కానీ రాష్ట్రంలోని సామాన్య జనానికి కూడా తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే మంచి దారి దొరికినప్పుడే నిజమైన మార్పు వస్తుంది.
ప్రభుత్వ బడి బాగుంటే ఎవరూ లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్‌కి పోరు, అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కూడా ఫీజులు తగ్గిస్తాయి. చదువు అనేది కొనేది కాదు, అందరికీ దక్కాల్సిన హక్కు. ఆ హక్కు తెలంగాణలోని ప్రతి పిల్లవాడికి దక్కాలంటే ప్రభుత్వ బడి బతకాలి, బలపడాలి.
- నల్లవెల్లి భరత్ కుమార్, గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ కార్యదర్శి-
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected] రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
