- క్రీడా వేదికలు, వసతి, రవాణా, భద్రతపై మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర క్రీడా రంగ ప్రతిష్ఠకు తగ్గట్టు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. సోమవారం సెక్రటేరియట్లో జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను శాఖల వారీగా సమీక్షించారు. రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 23 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026కు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో క్రీడా వేదికల సంసిద్ధత, మౌలిక వసతులు, క్రీడాకారులకు వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహారం, పరిశుభ్రత, స్వాగత ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలపై అధికారులతో మంత్రి చర్చించారు.
వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే యువ క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి క్రీడా వేదిక వద్ద అవసరమైన సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. పోటీల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రాష్ట్ర యువ క్రీడాకారులకు తమ ప్రతిభను జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు మంచి అవకాశం కల్పిస్తాయన్నారు.
