రఘునాథపల్లి, వెలుగు: వెల్ది తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్, సోషల్ టీచర్ శశికుమారి జెట్ స్టేట్ ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు-2026కు ఎంపికై పురస్కారాలు అందుకున్నారు. సోమవారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జటధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (జెట్) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేశారు.
విద్యా బోధనలో వినూత్న విధానాలు, సాంకేతికత వినియోగం, విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న కృషికి గుర్తింపుగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 50 మంది ఉపాధ్యాయుల్లో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. ఒకే పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు రాష్ట్రస్థాయి అవార్డులు అందుకోవడంతో పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
