India vs Japan: ఆసియా క్రీడల సమరానికి ముందు భారత పురుషుల క్రికెట్ జట్టు జపాన్ గడ్డపై అడుగు పెట్టింది. ఆసియా గేమ్స్ 2026 ఆరంభానికి ముందు ఆతిథ్య జపాన్‌తో టీమిండియా ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడబోతుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే భారత్, జపాన్ జట్లు తలపడటం ఇది మొట్టమొదటిసారి కావడం విశేషం. సుజుకి కప్ (Suzuki Cup) పేరుతో నిర్వహిస్తున్న ఈ చారిత్రాత్మక మ్యాచ్ రేపు (సెప్టెంబర్ 22, మంగళవారం) ఉదయం 9:30 గంటలకు తోచిగి ప్రిఫిక్చర్‌లోని సాను ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో స్టార్ట్ కానుంది.
బుమ్రా, అభిషేక్ ఔట్.. ఓపెనర్లుగా వైభవ్, సంజు:
ఈ ఏకైక టీ20 మ్యాచ్‌లో సీనియర్లకు రెస్ట్ ఇచ్చి యువ రక్తానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌లకు ఈ మ్యాచ్ నుంచి పూర్తిగా విశ్రాంతి ఇవ్వనున్నారు. ఇక 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీతో కలిసి సంజు శాంసన్ ఓపెనింగ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఫస్ట్ డౌన్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు రానుండగా, నాలుగో స్థానంలో తిలక్ వర్మ ఆడనున్నాడు.
4 ఆల్‌రౌండర్లు.. తుది జట్టు కూర్పు ఇదే:
జపాన్‌తో పోరు కోసం టీమిండియా నలుగురు ఆల్‌రౌండర్లతో రిస్క్ లేని కాంబినేషన్‌ను ఎంచుకోనుంది. శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్‌లు ఆల్‌రౌండర్లుగా తుది జట్టులోకి రానున్నారు. అలాగే ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను అర్షదీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్‌లు పంచుకోనుండగా, ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ ప్లేయింగ్ 11లో స్థానం దక్కించుకోనున్నాడు.
►ALSO READ | ఇండియాలో రెచ్చిపోతారు.. విదేశాల్లో తేలిపోతారు: భారత జట్టుపై మాజీ సెలక్టర్ హాట్ కామెంట్స్
భారత ప్లేయింగ్ XI అంచనా:
సంజు శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, అర్షదీప్ సింగ్.
వీవీఎస్ లక్ష్మణ్ డైరెక్షన్ లో టీమిండియా:
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో ఈ జపాన్ టూర్, ఆసియా గేమ్స్ పర్యవేక్షణ బాధ్యతలను నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ చూసుకుంటున్నారు. ఆసియా గేమ్స్‌లో మెయిన్ స్క్వాడ్‌తో బరిలోకి దిగేకంటే ముందే, ఈ ఏకైక టీ20 మ్యాచ్ యువ ఆటగాళ్లకు తమ సత్తా చాటుకోవడానికి, అక్కడి మైదాన పరిస్థితులకు అలవాటు పడటానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మారనుంది.
