- కమిషనరేట్ డ్యూటీల్లో 2,100 సిబ్బంది, 600 సీసీ కెమెరాలు, డ్రోన్లు
- గ్రేటర్ వరంగల్ పరిధిలో 1600 మంది బందోబస్తు.. 150 మంది ఆఫీసర్ల స్పెషల్ ఫోకస్
- పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కమిషనర్ పర్యవేక్షణ
- గ్రేటర్ నిమజ్జన ప్రాంతాల్లో జీడబ్ల్యూఎంసీ తరఫున ఏర్పాట్లు
వరంగల్, వెలుగు: ఓరుగల్లు వినాయక నిమజ్జనాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు గ్రేటర్ లో నవరాత్రుల పూజల అనంతరం భక్తులు గణపతులను బుధవారం నిమజ్జనం చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు నిమజ్జనాలకు అవసరమైన చెరువులు, కుంటలను శుభ్రపరిచే పనులు చేపట్టారు.
పోలీస్ ఉన్నాతాధికారులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు జరిపేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా వందలాది మంది సిబ్బందిని బందోబస్త్కోసం ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వంటి టెక్నాలజీ సేవలను ఉపయోగిస్తున్నారు.
కమిషనరేట్లో 2,100, ట్రైసిటీలో 1,600 మంది..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 3 జోన్లలో దాదాపు 8 వేల వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. కాగా, బుధవారం నిర్వహించే నిమజ్జన డ్యూటీల కోసం పోలీస్ ఉన్నాతాధికారులు నలుగురు డీసీపీలు, ఇద్దరు అడిషనల్ డీసీపీలు, 12 నుంచి 16 మంది ఏసీపీలు, 50 మంది సీఐలు, 70 మంది ఎస్సైలతో పాటు ఏఎస్సైలు, హెడ్‍కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలిపి మొత్తంగా 2,100 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్ నిర్వహించనున్నారు. గ్రేటర్ వరంగల్ ట్రైసీటీ పరిధిలోనే 1600 మంది విధుల్లో ఉండనున్నారు. ఆయా ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న పలుమార్లు పరిశీలించారు.
ఊరేగింపు దారుల్లో.. సీసీ కెమెరాలు, డ్రోన్లు
వరంగల్ ట్రైసిటీతో పాటు చుట్టూ కాలనీల్లోని వినాయక నిమజ్జనం కోసం గ్రేటర్ మున్సిపల్ ఆఫీసర్లు ప్రధాన చెరువులు, కుంటలతో కలిపి 22 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. క్రేన్లు అందుబాటులో ఉంచుతున్నారు. పోలీస్‍శాఖ పరంగా సిబ్బందితో పాటు గణనాథుల ఊరేగింపు నిర్వహించే జంక్షన్లు, సెంటర్లు, నిమజ్జన ప్రాంతాల్లో 600 సీసీ కెమెరాలు ఉపయోగించనున్నారు.
ఇందులో ప్రధానంగా హనుమకొండ పద్మాక్షి టెంపుల్ సిద్దేశ్వర గుండం, వరంగల్ చిన్న వడ్డెపల్లి చెరువు, వరంగల్కోట చెరువు, గీసుగొండ కట్ట మల్లన్న చెరువు, కరీమాబాద్ ఉర్సు గుట్ట రంగం చెరువు, మామూనూర్ బెస్తం చెరువు, ఖిలా వరంగల్ అగర్తల చెరువు, మామూనూర్ పెద్ద చెరువు, కాజీపేట బంధం చెరువు, చల్లా చెరువు, గోపాల్పూర్ చెరువు, భీమారం చెరువు, హసన్పర్తి చెరువుల వద్ద సీసీ కెమెరాలు బిగించారు. ఇవేగాక వినాయక శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో పోలీసులు, డ్రోన్లు వినియోగించడం ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మూడోకన్నుతో సెక్యూరిటీ నిర్వహించనున్నారు.
