- ఏఐసీటీఈ గుర్తింపు వచ్చాకే స్కిల్ వర్సిటీ పరిధిలోకి
- సర్కారుకు నివేదిక సమర్పించిన కేశవరావు కమిటీ
- ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని స్పష్టీకరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై సందిగ్ధానికి తెరపడింది. వీటిని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి మాత్రం పాలిటెక్నిక్ కాలేజీలు టెక్నికల్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ పరిధిలోనే కొనసాగుతాయని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీ తేల్చిచెప్పింది.
ఈ మేరకు కమిటీ తన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ వర్సిటీలో విలీనం చేసే విషయంలో కమిటీ అత్యంత కీలకమైన సిఫార్సు చేసింది.
యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నుంచి అధికారిక గుర్తింపు లభించిన తర్వాతే, పాలిటెక్నిక్ కళాశాలలను ఆ వర్సిటీ పరిధిలోకి బదిలీ చేయాలని సూచించింది. జాతీయ స్థాయి ప్రమాణాల కోసం ఈ అఫిలియేషన్ తప్పనిసరి అని, ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కళాశాలలన్నీ యథావిధిగా సాంకేతిక విద్యాశాఖ పర్యవేక్షణలోనే ఉంటాయని స్పష్టం చేసింది.
కళాశాలలు ఒకవేళ స్కిల్ వర్సిటీ పరిధిలోకి వెళ్లినప్పటికీ.. విద్యా సంబంధిత కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు ఉండవని కమిటీ భరోసా ఇచ్చింది. డిప్లొమా కోర్సుల నిర్వహణ, పరీక్షల విధానం, బోధన పాత పద్ధతిలోనే కొనసాగుతాయని తెలిపింది.
అలాగే, పాలిటెక్నిక్ అధ్యాపకులు, ఇతర సిబ్బంది ప్రమోషన్లు, సీనియారిటీ జాబితాలు, సర్వీసు నిబంధనల విషయంలో పాత నిబంధనలే అమలవుతాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా, పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఏమాత్రం లేదని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది.
గడువుకు మూడు రోజుల ముందే నివేదిక
సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు అందరి అభిప్రాయాలను సేకరించిన కమిటీ.. గడువు కంటే మూడు రోజుల ముందే తన నివేదికను సిద్ధం చేసింది. సోమవారం కేకేతో పాటు శ్రీదేవసేన, నవీన్ మిట్టల్ తదితరులు కలిసి సీఎస్ సంజయ్ జాజుకు నివేదికను అందజేశారు.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో స్కిల్ వర్సిటీలు ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉండటాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిటీ, రాష్ట్రంలోని వర్సిటీని కూడా అదే పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది.
