- గణేశ్ బందోబస్తుకు జిల్లాల నుంచి 1,500 మంది
- డబ్బులు జమ కాక అన్నదాన శిబిరాల వద్ద
- కడుపు నింపుకుంటున్న సిబ్బంది
హైదరాబాద్, వెలుగు: గణేశ్ నిమజ్జనం, బందోబస్తు కోసం వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన హోంగార్డులకు ఆకలి తిప్పలు తప్పడం లేదు. ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చిన సుమారు 1,500 మంది హోంగార్డులకు ఒక్కో రోజుకు రూ. 300 చొప్పున డైట్ చార్జీలు ఇస్తామని అనుమతులు లభించినప్పటికీ, అమలులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
పది రోజులు గడుస్తున్నా ఆ డబ్బులు వారి ఖాతాల్లో డిపాజిట్ కాకపోవడంతో హోంగార్డులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డైట్ చార్జీలు అందకపోవడంతో కొద్దిరోజులుగా వారు విధులు నిర్వహించే ప్రాంతాల్లోని గణేశ్ మండపాలు, అన్నదాన శిబిరాల వద్దే కడుపునింపుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఇబ్బందులను హోంగార్డులు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటున్నారు.
కాగా, మేడ్చల్ మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు మాత్రం డైట్ చార్జీలు వారి ఖాతాల్లో జమయ్యాయి. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలోని హోంగార్డులకు మాత్రం సాంకేతిక కారణాల వల్ల ఇంకా అందలేదు. ఈ సమస్యను గుర్తించిన ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఒకటిరెండు రోజుల్లో వారి ఖాతాలకు డైట్ చార్జీలు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
