మాదాపూర్ ఓయో రూంలో యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపేశాడా..?

మాదాపూర్ ఓయో రూంలో యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపేశాడా..?

హైదరాబాద్: మాదాపూర్ ఓయో రూంలో యువతి అనుమానస్పద మృతి ఘటన కలకలం రేపింది. ప్రియుడు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మాదాపూర్ సిద్దిక్ నగర్లోని ఓయో హోటల్ ఈ ఘటన జరిగింది. మృతురాలు విశాఖపట్నం వాసి షారన్ నిఖిత టోప్నోగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస రవి తేజతో అనే వ్యక్తితో కలిసి సోమవారం మధ్యాహ్నం నిఖిత హైదరాబాద్ సిటీకి వచ్చింది.

OYO యాప్ నుంచి రూం బుక్ చేసుకుని.. మాదాపూర్‌ సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్ 5లోని 'హోటల్ OSLN టెర్మినస్'లో రూమ్ నంబర్ 303లో ఇద్దరూ అద్దెకు దిగారు. తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి మహిళ మృతిపై మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది. షారన్ నిఖితను ఆమె ప్రియుడు శ్రీనివాస రవి తేజ, హోటల్ సిబ్బందితో కలిసి అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు వైద్యులు తెలిపారు.

హాస్పిటల్కు వచ్చిన సమయానికి మహిళ మృతి చెందినట్లు వైద్యులు పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. మృతురాలి ముఖం,తలపై తీవ్రమైన గాయాలు, వాపులు ఉన్నట్లు గుర్తించారు. యువతి మృతి చెందినట్లు తెలియగానే ఆమె ప్రియుడు శ్రీనివాస రవి తేజ ఆసుపత్రి సిబ్బంది కంటపడకుండా అక్కడి నుంచి పరారయ్యాడు.

ALSO READ : మహిళ హత్య కేసులో  నిందితుడికి జీవిత ఖైదు

హోటల్ రూమ్ నంబర్ 303 గదిలోని గోడలపై, బెడ్‌షీట్‌పై అనుమానాస్పద రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. పోలీసులు వెంటనే క్లూస్ టీమ్‌ను రప్పించారు. నిందితుడు శ్రీనివాస రవి తేజ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు.