నిజామాబాద్, వెలుగు: బంగారు ఆభరణాల కోసం మహిళను హత్య చేసిన నిందితుడికి జీవితకాలం శిక్ష విధిస్తూ నిజామాబాద్ జిల్లా సెషన్స్(ఫ్యామిలీ, ఉమెన్స్) కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. సీపీ సాయిచైతన్య వివరాల ప్రకారం.. నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆకుల అనంత అలియాస్ సోనీకి(29) మోస్రా గ్రామానికి చెందిన కుమురం పాండవాల సాగర్ దూరపు బంధువు.
ఒంటరిగా ఉంటున్న సోనీ ఇంటికి అప్పుడప్పుడు వెళ్లే సాగర్.. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలపై కన్ను వేశాడు. గతేడాది నవంబర్ 25న సోనీ ఇంట్లోనే ఆమె గొంతు నులిమి హత్య చేసి నగలతో పారిపోయాడు. కేసు నమోదు చేసిన నవీపేట పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. బలమైన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించగా పరిశీలించిన న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్.. సాగర్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.
