అమెరికా రాజకీయాల్లో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ ఆంక్షల వివాదం మరోసారి తారాస్థాయికి చేరింది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయాలు, మీడియా సంస్థల న్యాయపోరాటం మధ్య ట్రంప్ ప్రారంభించిన "ట్రంప్ టీవీ" డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ట్రంప్ టీవీ ప్రారంభం..
అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థలపై ట్రంప్ ఆంక్షలు విధించిన కొన్ని గంటల వ్యవధిలోనే వైట్‌హౌస్ "ట్రంప్ టీవీ: ది ఎసెన్షియల్స్ స్టేషన్" పేరుతో 24 గంటల స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. సోమవారం వైట్‌హౌస్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ డిజిటల్ వేదిక ద్వారా అధ్యక్షుడు ట్రంప్ గత ప్రసంగాలు, బహిరంగ సభలు, పరిపాలనా విధానాలు, ప్రకటనలు, అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను నిరంతరం ప్రసారం చేస్తున్నారు. సాంప్రదాయ మీడియా సంస్థల ప్రమేయం లేకుండా.. ప్రజలకు నేరుగా ప్రభుత్వ సమాచారాన్ని అందించడమే ఈ ప్లాట్‌ఫారమ్ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.
Streaming 24/7. Live at 7PM. 👀📺 https://t.co/ax9obEH4sf
— The White House (@WhiteHouse) September 21, 2026
మీడియా సంస్థల న్యాయపోరాటం..
అమెరికాలోని CNN, MS NOW, పొలిటికో వంటి టాప్ మీడియా సంస్థలు తమపై వైట్‌హౌస్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. తమ జర్నలిస్టులకు వైట్‌హౌస్‌లోకి ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ఫస్ట్ అమెండ్మెంట్ హక్కులను హరించడమేనని ఆ సంస్థలు వాదించాయి. ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాస్తున్నారనే కక్షతోనే తమపై ఈ ఆంక్షలు విధించారని ఆరోపిస్తూ.. వెంటనే తమ ప్రవేశాన్ని పునరుద్ధరించాలని కోర్టును కోరాయి. ఈ కేసుకు సంబంధించి యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి తిమోతి కెల్లీ విచారణ చేపట్టనున్నారు.
ప్రభుత్వ వాదన..
తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న ట్రంప్.. వార్తా సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. ఫస్ట్ అమెండ్మెంట్ పత్రికా స్వేచ్ఛను రక్షిస్తుందని, అయితే వ్యక్తిగత వార్తా సంస్థలకు వైట్‌హౌస్ ప్రాంగణంలోకి లేదా ప్రెస్‌పూల్‌లోకి ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత తమకు లేదని వైట్‌హౌస్ వాదిస్తోంది. ఈ వివాదం కారణంగా వైట్‌హౌస్ టెలివిజన్ పూల్ వ్యవస్థ కూడా దెబ్బతింది. సీఎన్‌ఎన్ సంస్థకు ప్రవేశం నిరాకరించడంతో.. ఇతర ప్రధాన బ్రాడ్‌కాస్టర్లు కూడా ప్రత్యామ్నాయంగా వ్యవహరించడానికి నిరాకరించి అధ్యక్షుడి కార్యక్రమాల కవరేజీని తాత్కాలికంగా నిలిపివేశాయి.
ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న 81వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ పరిణామాలు అంతర్జాతీయంగానూ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు సాంప్రదాయ మీడియాతో పోరాటం చేస్తూనే.. స్వయంగా డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువయ్యే వ్యూహాన్ని ట్రంప్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది.
