ఒకప్పుడు ప్రపంచ పటాన్ని పరిశీలిస్తే బ్రిటిష్ సామ్రాజ్యంలో లేని ప్రాంతం దాదాపు ఉండేది కాదు. అందుకే ‘బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు’ అనే నానుడి పుట్టింది. ఆసియా, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో విస్తరించిన ఆ సామ్రాజ్యం ప్రపంచ రాజకీయాలు, వాణిజ్యం, నౌకాయానం, పారిశ్రామికీకరణపై శతాబ్దాలపాటు ప్రభావం చూపింది.
అయితే నేడు పరిస్థితి పూర్తిగా మారింది. ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన బ్రిటన్‌లోనే యునైటెడ్ కింగ్‌డమ్ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా స్కాట్లాండ్ స్వాతంత్ర్యం, ఉత్తర ఐర్లాండ్.. ఐర్లాండ్‌తో విలీనం, కొంతవరకు వేల్స్ స్వయంప్రతిపత్తి వంటి అంశాలు చర్చనీయాంశాలుగా మారాయి.
యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్తర్న్ ఐర్లాండ్‌లో నాలుగు రాజ్యాంగపరమైన దేశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్. ఇవన్నీ కలిపి సుమారు 69 మిలియన్ల జనాభాను కలిగి ఉన్నాయి.
ప్రపంచ బ్యాంకు ప్రకారం 2025లో యునైటెడ్ కింగ్‌డమ్ స్థూల దేశీయోత్పత్తి సుమారు
4 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. తలసరి జీడీపీ సుమారు 57,600 డాలర్లు. ఇంగ్లాండ్ జనాభా, ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో మిగిలిన మూడు దేశాల కంటే ఎంతో పెద్దది.
లండన్ ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఒకటి. స్కాట్లాండ్‌కు ఉత్తర సముద్రంలోని చమురు, సహజ వాయువు, విస్తారమైన సముద్ర వనరులు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉన్నాయి. వేల్స్‌కు బొగ్గు ఆధారిత పారిశ్రామిక వారసత్వంతోపాటు జల, గాలి విద్యుత్ సామర్థ్యం, వ్యవసాయం ఉన్నాయి.
ఉత్తర ఐర్లాండ్‌కు వ్యవసాయం, ఆహార పరిశ్రమ, సేవారంగం, ఐర్లాండ్‌తో ఉన్న ఆర్థిక సంబంధాలు ముఖ్యమైనవి. అయితే బ్రిటన్ సంపదకు సహజ వనరులకన్నా మానవ వనరులు, ఆర్థిక సేవలు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ వాణిజ్యం, బలమైన సంస్థాగత వ్యవస్థలు ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి.
విడిపోవాలనే ఆకాంక్ష ఎంత?
ఈ ప్రశ్నకు నాలుగు దేశాల్లోనూ ఒకే సమాధానం లేదు. స్కాట్లాండ్‌లో స్వాతంత్ర్య భావన అత్యంత బలంగా ఉంది. 2014లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 55 శాతం మంది యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే కొనసాగాలని, 45 శాతం మంది స్వాతంత్ర్యానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే ఆ తరువాత స్వాతంత్ర్యానికి మద్దతు గణనీయంగా కొనసాగింది.
2025లోని వివిధ సర్వేలలో ‘అవును’, ‘కాదు’ మధ్య పోటీ చాలా దగ్గరగా కనిపించింది. 2026లో స్కాటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్యంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ముసాయిదా బిల్లును కూడా ప్రచురించింది. అందులో 2014లో ఉపయోగించిన ‘స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఉండాలా?’ అనే ప్రశ్ననే ప్రతిపాదించింది.
వేల్స్‌లో మాత్రం పూర్తి స్వాతంత్ర్యానికి మద్దతు తక్కువగా ఉంది. 2024 యూగవ్ సర్వేలో 24 శాతం మంది స్వాతంత్ర్యానికి మద్దతు ఇవ్వగా, 61 శాతం మంది వ్యతిరేకించారు. అయితే ఉత్తర ఐర్లాండ్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ ప్రధాన ప్రశ్న బ్రిటన్‌లో కొనసాగడమా? లేక రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌తో ఐక్యమవడమా? అన్నది. ఈ అంశంపై ప్రజాభిప్రాయం కాలానుగుణంగా మారుతూ ఉంటుంది.
విడిపోతే లాభమా?
స్కాట్లాండ్ లేదా మరే దేశమైనా విడిపోతే తప్పకుండా లాభపడుతుంది లేదా నష్టపోతుంది అని ముందుగానే చెప్పడం సాధ్యం కాదు. స్వాతంత్ర్యం వల్ల సొంత పన్ను విధానం, బడ్జెట్, వాణిజ్య విధానం, వనరుల వినియోగంపై పూర్తి నియంత్రణ లభించవచ్చు. ముఖ్యంగా ఉత్తర సముద్ర చమురు, పునరుత్పాదక ఇంధనం వంటి వనరులను తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కొత్త సరిహద్దులు, కరెన్సీ, రుణాల భాగస్వామ్యం, రక్షణ వ్యవస్థ, వాణిజ్య ఒప్పందాలు, యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలు, పెన్షన్లు, ప్రభుత్వ ఆస్తులు వంటి అనేక క్లిష్టమైన ప్రశ్నలను పరిష్కరించాల్సి ఉంటుంది.
సామ్రాజ్యం నుంచి సంక్షోభం వరకు
రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటన్ ఆర్థికంగా బలహీనపడింది. వలస దేశాలకు స్వాతంత్ర్యం లభించడం, అమెరికా– సోవియట్ శక్తుల ఎదుగుదల, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని క్రమంగా కుదించాయి. అనంతరం భారీ పరిశ్రమల క్షీణత, ఉత్పాదకత సమస్యలు, ప్రాంతీయ ఆర్థిక అసమానతలు, ప్రజాసేవలపై ఒత్తిడి, జీవన వ్యయ సమస్యలు, రాజకీయ విభజనలు బ్రిటన్‌లో అసంతృప్తిని పెంచాయి. అయినా బ్రిటన్ ఇంకా ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక, సాంకేతిక, విద్యా, సైనిక, దౌత్య శక్తులలో ఒకటి. 2025–26లో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా 1,020 ప్రాజెక్టులు బ్రిటన్‌కు వచ్చి, సుమారు 69,000 కొత్త ఉద్యోగాలు సృష్టించాయి.
అందువల్ల ‘రవి అస్తమించని సామ్రాజ్యం’ అనే గత వైభవాన్ని నేటి బ్రిటన్‌తో నేరుగా పోల్చడం కంటే, అది సామ్రాజ్యం నుంచి ఆధునిక దేశంగా ఎలా పరివర్తన చెందిందో చూడాలి. యునైటెడ్ కింగ్‌డమ్ విచ్ఛిన్నం అవుతుందా లేదా అనేది ఇప్పటికీ బహిరంగ చర్చ.
అయితే స్కాట్లాండ్‌లో స్వాతంత్ర్య చర్చ, ఉత్తర ఐర్లాండ్ భవిష్యత్తు, వేల్స్‌లో పెరుగుతున్న జాతీయ గుర్తింపు, బ్రెగ్జిట్ ప్రభావం.. ఇవన్నీ కలిసి బ్రిటన్ తన భవిష్యత్తు రాజ్యాంగ నిర్మాణంపై మరోసారి ఆలోచించాల్సిన దశకు చేరిందనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. భవిష్యత్తులో బ్రిటన్ బలం కేవలం తన గత సామ్రాజ్య వైభవంలో కాదు. నాలుగు దేశాల ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ కొత్త సమాఖ్య సంబంధాలను నిర్మించగల సామర్థ్యంలో ఉంటుంది.
బ్రెగ్జిట్ ప్రభావం
2016లో జరిగిన బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని అంతర్గత విభేదాలను మరింత స్పష్టంగా చేసింది. ఇంగ్లాండ్, వేల్స్‌లో మెజారిటీ ‘లీవ్’కు ఓటు వేయగా, స్కాట్లాండ్‌లో 62 శాతం మంది ‘రీమైన్’ కు ఓటు వేశారు. ఈ విభిన్న ప్రజాభిప్రాయం స్కాట్లాండ్‌లో ‘మేం కోరుకోని నిర్ణయాన్ని మొత్తం యూకే ఎందుకు తీసుకోవాలి?’ అనే రాజకీయ వాదనకు బలం ఇచ్చింది. బ్రెగ్జిట్ తర్వాత యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య సంబంధాలు మారాయి. 2025లో యూకే మొత్తం వస్తువులు, సేవల వాణిజ్య విలువ 1.868 ట్రిలియన్ బ్రిటిష్ పౌండ్లకు చేరినప్పటికీ, వస్తువుల వాణిజ్యంలో భారీ లోటు కొనసాగింది. సేవల రంగంలో మాత్రం గణనీయమైన మిగులు ఉంది. అయితే బ్రెగ్జిట్ ఒక్కటే బ్రిటన్ సమస్యలకు కారణమని చెప్పడం సరైంది కాదు.
- దురిశెట్టి మనోహర్, రిటైర్డ్ ఏడీఈ–
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
