వెలుగు స్పెషల్ : తెలంగాణలో కూరగాయల సాగు సంక్షోభం

వెలుగు స్పెషల్ : తెలంగాణలో కూరగాయల సాగు సంక్షోభం

తెలంగాణలో కూరగాయల సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గుతోంది. దీంతో పోషకాహార, ఆహార భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సంక్షోభంపై  ప్రభుత్వం తక్షణం పాలనాపరంగా విధానపరమైన దృష్టిని సారించాల్సిన అవసరం ఉంది. 

 పబ్లిక్‌‌‌‌ పాలసీ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌గాతగినంత విధానపరమైన ప్రాధాన్యత లభించలేదని నేను భావిస్తున్న ఒక ముఖ్యమైన అంశాన్ని ఈ ఆర్టికల్‌‌‌‌ ద్వారా సీఎం  రేవంత్‌‌‌‌రెడ్డికి తెలియజేస్తున్నాను.  అదేమిటంటే,  తెలంగాణలో గత దశాబ్ద కాలంగా కూరగాయల సాగు విస్తీర్ణంలో నిరంతరం చోటుచేసుకుంటున్న తగ్గుదల ఆందోళనను  కలిగిస్తున్నది.   దానివల్ల రైతుల జీవనోపాధి, పట్టణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు, అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, పిల్లల పోషకాహార భద్రతపై  తీవ్ర ప్రభావం పడుతున్నది.

  తెలంగాణ శాసనసభలో ( సెషన్‌‌‌‌ 8,  మీటింగ్‌‌‌‌ 2)  L.A.Q. నం. 2081 (స్టార్డ్)కు  ప్రభుత్వం ఇచ్చిన సమాధానం  ప్రకారం.. వ్యవసాయ,  సహకార శాఖ స్వయంగా ఒక విషయాన్ని నమోదు చేసింది.  ‘2014 నుంచి గత సంవత్సరం వరకు కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడం ఆందోళన కలిగించే విషయం.   స్వతంత్ర నివేదికలు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయి.  


రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం 2013–-14లో సుమారు 5.45 లక్షల ఎకరాల నుంచి 2024–-25 నాటికి   కేవలం 1.13 లక్షల ఎకరాలకు పడిపోయింది.  అంటే దాదాపు 80 శాతం తగ్గుదల నమోదైంది.   కూరగాయల సాగు   విస్తీర్ణంలో భారతీయ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ప్రస్తుతం 15వ స్థానంలోనూ,  ఉత్పత్తిలో 14వ స్థానంలోనూ ఉంది.  దీని ఫలితంగా ఇతర రాష్ట్రాలపై ఆధారపడటం పెరుగుతోంది.  రాష్ట్రానికి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయల అవసరం ఉండగా,  అందులో  తెలంగాణ  రైతులు  ప్రస్తుతం 21 లక్షల  టన్నులను మాత్రమే  సరఫరా చేస్తున్నారు.  

మిగిలిన అవసరాల కోసం,  కేవలం 2025-–26 సంవత్సరంలోనే ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలను దిగుమతి చేసుకున్నట్లు ప్రభుత్వమే శాసనసభలో ఇచ్చిన సమాధానంలో పేర్కొంది.  ఇది కేవలం వ్యవసాయపరమైన సమస్య మాత్రమే కాదు, పోషకాహారం,   ప్రజారోగ్యానికి  సంబంధించిన సమస్య కూడా.  దీంతో  తక్కువ  ఆదాయం కలిగిన  పట్టణ,  శివారు ప్రాంతాల కుటుంబాల్లోని మహిళలు,  పిల్లలు ఇప్పటికే రక్తహీనత అదేవిధంగా  పోషకాహార లోపం బారిన పడే  ప్రమాదంలో ఉన్నారు.  ఇది  రాష్ట్ర  ప్రజారోగ్య పరిధిలోకి పూర్తిగా వస్తుందని నేను గౌరవపూర్వకంగా తెలియజేస్తున్నాను.

మూల కారణాలు

కూరగాయల సాగు  క్షీణతకు అనేక కారణాలు ఉన్నాయి. నిశితంగా పరిశీలిస్తే  ఇవి హైదరాబాద్ చుట్టుపక్కల అత్యంత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల సాగు సమస్యలు క్రమంగా  పెరుగుతున్నాయి. సాధారణ,  సారవంతమైన వ్యవసాయ భూమిని  రియల్ ఎస్టేట్,  పారిశ్రామిక అవసరాలకు,  నగర విస్తీరణ, రాళ్లు, మట్టి తవ్వకాల కార్యకలాపాలకు  కేటాయించడం జరుగుతోంది. 

పంట పరిమాణంతో  సంబంధం లేకుండా  రైతులను నష్టపరిచేలా ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు, కూరగాయలకు  రాష్ట్ర కనీస మద్దతు ధర లేకపోవడం,  ప్రత్యేక సేకరణ యంత్రాంగం లేకపోవడం రైతాంగాన్ని కుదేలు చేస్తున్నది.  సంస్థాగత రుణాల లభ్యత తక్కువగా ఉండటంతో  రైతులు సతమతం అవుతున్నారు. 

కూరగాయల విత్తన ఉత్పత్తి లేదా నాణ్యత ధృవీకరణ వ్యవస్థ లేకపోవడం గమనార్హం.  6,000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న హైదరాబాద్ మాస్టర్ ప్లాన్‌‌‌‌లో  కొత్తగా టోకు  లేదా చిల్లర కూరగాయల మార్కెట్ల కోసం తగినంతగా భూమిని కేటాయించలేదు. రాత్రిపూట ఆగే బస్సు సర్వీసులు నిలిచిపోవడం, ఎంఎంటిఎస్ షెడ్యూళ్లు నమ్మశక్యంగా లేకపోవడం వంటి క్షీణిస్తున్న రైతు రవాణా సౌకర్యాలు.. రైతులను ఖరీదైన  ప్రైవేట్ రవాణా వైపు నెడుతున్నాయి. 

గతంలో ప్రస్తావించిన ఒక సంస్థాగత లోపం

నేను గతంలో 14 జనవరి 2025న (తెలంగాణలో పంట, కూరగాయలు,  పండ్ల వైవిధ్యాన్ని ప్రోత్సహించే దిశగా సూచనలు) సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డికి లేఖ రాశాను.  అందులో,  ఇతర విషయాలతోపాటు వ్యవసాయ,  ఉద్యానవన శాఖలలో  ప్రత్యేకంగా కూరగాయల కోసం కూడా  కొత్త ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశాను. ఇది నేరుగా సంబంధిత సందర్భం కాబట్టి ఆ సిఫార్సును ఇక్కడ  మరోసారి పునరుద్ఘాటించాలనుకుంటున్నాను.  

ప్రస్తుతం కూరగాయలకు ప్రత్యేకమైన  సంస్థాగత స్థానం లేదు. ఈ పంట సమూహానికి మొత్తంగా బాధ్యత వహించే ఒక ప్రత్యేక విభాగం,  డైరెక్టరేట్ లేదా నోడల్ అధికారి లేకుండా అవి వ్యవసాయ, ఉద్యానవన శాఖలలో విస్తరించి ఉన్నాయి.  సాగు క్షీణత సమస్య  దశాబ్దానికి పైగా పరిష్కరించకపోవడానికి ఈ సంస్థాగత లోపము ఒక కారణమని  నేను  భావిస్తున్నాను.  కూరగాయల  సాగు, విత్తనాల సరఫరా, మార్కెటింగ్ లేదా రైతు మద్దతు విషయంలో శాఖాపరమైన జవాబుదారీతనం కోసం ఒక కేంద్రం కూడా లేదు.

ప్రస్తుత ప్రణాళికలో లోపం

క్యూర్‌‌‌‌‌‌‌‌ ప్రణాళిక గానీ,  తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రంగానీ ఈ క్షీణతను గుర్తించకపోవడం లేదా దానిని పరిష్కరించే చర్యలను నిర్దేశించకపోవడం పట్ల నేను ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. విత్తనాలు, మల్చింగ్, షేడ్ నెట్స్, పందిళ్లు,   డ్రిప్/స్ప్రింక్లర్ నీటిపారుదలపై 40 నుంచి  90 శాతం వరకు సబ్సిడీల మద్దతుతో,  సాధారణంగా 51,000 ఎకరాల్లో ఉన్న కూరగాయల సాగును 72,583 ఎకరాలకు  తీసుకువచ్చిన ప్రభుత్వపు ఇటీవలి ఖరీఫ్ 2026 కార్యక్రమాన్ని నేను స్వాగతిస్తున్నప్పటికీ, కేవలం ఒక్క సీజన్‌‌‌‌లో సాధించిన ఈ లాభం దశాబ్ద కాలంగా ఉన్న నిర్మాణాత్మక క్షీణతను తిప్పికొట్టలేదు, అలాగే  రాష్ట్ర  దీర్ఘకాలిక ప్రణాళిక చట్రంలో ఇది ప్రత్యామ్నాయం కాలేదు.  అసెంబ్లీలో తెలిపిన సమాధానం ప్రకారం.. పొలంలో పండించే పంటల రైతుల కంటే స్పష్టంగా భిన్నమైన నష్టభయాలను ఎదుర్కొనే కూరగాయల రైతుల కోసం ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యేకంగా పెంచిన లేదా విభిన్నమైన రైతు భరోసా/ఇన్‌‌‌‌పుట్ సబ్సిడీని ప్రతిపాదించలేదు. 

హైదరాబాద్ మాస్టర్ ప్లాన్‌‌‌‌లో భూమిని అధికారికంగా కేటాయించాలి

హైదరాబాద్ మాస్టర్ ప్లాన్‌‌‌‌లో భూమిని అధికారికంగా కేటాయించాలి.  పంట మార్పిడి, రసాయన రహిత లేదా తక్కువ వనరుల వినియోగంతో కూడిన సాగు,  పట్టణ,  నగర శివార్ల వ్యవసాయం, అలాగే 
ప్రత్యేక రాష్ట్ర కూరగాయల విత్తన ఉత్పత్తి,   వాటి నాణ్యత ధృవీకరణ  కార్యక్రమానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి.  

పంట కోత అనంతర నష్టాలను తగ్గించడానికి,  రాత్రిపూట ఆగే బస్సు సర్వీసుల పునరుద్ధరణ, 
స్థిరీకరించిన ఎంఎంటిఎస్ షెడ్యూళ్లు,  ప్రాథమిక  కోల్డ్ స్టోరేజీలతో  సహా రవాణా,  కోల్డ్-చెయిన్ మౌలిక సదుపాయాలు కల్పించాలి. 

 పట్టణాల్లోని పేదలకు అన్నిరకాల  కూరగాయలు  అందుబాటులో ఉండే
విధంగా   రాయితీ అవుట్‌‌‌‌లెట్లు లేదా ధరల స్థిరీకరణ బఫర్లు వంటి ధరల నియంత్రణ యంత్రాంగాలు ఏర్పాటు చేయాలి.  పైన పేర్కొన్న వాటిలో దేనికైనా మద్దతుగా మరిన్ని వివరాలు,  విశ్లేషణలను  
ప్రభుత్వంతో పంచుకోవాలంటే నేను సంతోషంగా అంగీకరిస్తాను.   ఈ విషయాన్ని సంబంధిత శాఖలతో చర్చించే అవకాశాలను కూడా నేను స్వాగతిస్తాను. 

 చురుకైన  సంక్షేమ విధానాల విషయంలో తెలంగాణకు ఉన్న రికార్డును దృష్టిలో ఉంచుకుని,  కూరగాయల సాగుకు  తగిన  ప్రాధాన్యత లేని ధోరణిని  కొనసాగనివ్వకుండా,  ఆహార భద్రత,   పోషణ విషయంలో నాయకత్వం వహించడానికి దీనిని ఒక అవకాశంగా  ప్రభుత్వం  
పరిగణిస్తుందని నేను  ఆశిస్తున్నాను.

(వ్యాస కర్త ముఖ్యమంత్రికి రాసిన లేఖ సారాంశం)


ప్రభుత్వం  చేపట్టాల్సిన  చర్యలు

ఒక సమగ్ర  స్వల్పకాలిక,   దీర్ఘకాలిక కార్యక్రమంగా నేను సూచించిన అంశాలను  ప్రభుత్వం పరిశీలించవలసిందిగా  వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. క్యూర్‌‌‌‌‌‌‌‌ ప్రణాళిక,  తెలంగాణ రైజింగ్ 2047 ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌లో మెజరబుల్‌‌‌‌ టార్గెట్స్‌‌‌‌తో  కూరగాయల సాగులో క్షీణతను స్పష్టంగా గుర్తించాలి.  ప్రస్తుతం ఉన్న ఎటువంటి ప్రత్యేక సంస్థాగత దృష్టి లేకుండా వ్యవసాయ,  ఉద్యానవన శాఖల మధ్య కూరగాయలను  పంపిణీ చేయడానికి బదులుగా... సాగు, విత్తన సరఫరా, మార్కెటింగ్,  రైతు మద్దతు కోసం స్పష్టమైన నోడల్ బాధ్యతతో ఒక ప్రత్యేక కూరగాయల విభాగం/ డైరెక్టరేట్‌‌‌‌ను ఏర్పాటుచేయాలి.

 నేను  14 జనవరి 2025 నాటి లేఖలో సిఫార్సు చేసినట్లుగా...మాస్టర్ ప్లాన్‌‌‌‌లు, పారిశ్రామిక అనుమతులు,  నీటిపారుదల పథకాలు కూరగాయల సాగుకు వ్యతిరేకంగా పనిచేయకుండా ఉండేందుకు, వ్యవసాయ, ఉద్యానవన,  హెచ్‌‌‌‌ఎమ్‌‌‌‌డిఎ / పట్టణాభివృద్ధి, నీటిపారుదల,  పర్యావరణశాఖల మధ్య విధానాల సమన్వయం అవసరం ఉంది.  పట్టణ ప్రాంతాల సమీపంలో చట్టపరమైన రక్షణతో, సారవంతమైన వ్యవసాయ,  ఉమ్మడి భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించడాన్ని అరికట్టే ఒక సుస్థిర భూ వినియోగ విధానం పాటించాలి.

- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​-

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.