వరంగల్, వెలుగు: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పట్టించుకోని ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు ఎందుకని కాక్రోచ్ పార్టీ నేతలు ప్రశ్నించారు. ఆదివారం ఎంజీఎం ఆరోగ్యశ్రీ వార్డులో స్లాబ్ పెచ్చులూడి పేషెంట్లు, సిబ్బంది గాయపడిన నేపథ్యంలో సోమవారం వారు ఆస్పత్రిని సందర్శించారు.
అదే సమయంలో వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా, సంచాలకులు డాక్టర్ వాణి, వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆస్పత్రిలోని పలు వార్డులను పరిశీలించారు. ఆఫీసర్లను కలిసేందుకు ప్రయత్నించిన తమను పోలీసులు అడ్డుకున్నారని నేతలు ఆరోపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజీఎం సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విమర్శించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయడంలో జాప్యంపై ప్రశ్నించారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ఇకపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.
