- రిటైల్ రేట్ల తగ్గుదల 3 శాతమే
- పశ్చిమాసియా సంక్షోభంతో పెరుగుతున్న కమోడిటీల ధరలు
న్యూఢిల్లీ: జీఎస్టీ 2.0 మొదలై ఏడాది పూర్తయింది. దీంతో పన్నులు తగ్గించినా, ధరలు మాత్రం పెద్దగా మారలేదు. ఆహార పదార్థాలు, వినియోగ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వల్ల సామాన్యులకు భారీ మేలేమీ జరగలేదు. ఆటో రంగం మినహా మిగతా వస్తువుల ధరల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఉదాహరణకు..మారుతి ఆల్టో కారు ధర రేటు తగ్గింపునకు ముందు రూ.4.23 లక్షల ఉండగా రేటు తగ్గింపు తర్వాత రూ.3.69 లక్షలకు పడిపోయింది.
ప్రస్తుతం కూడా అదే ధర ఉంది. మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్ 2 బండి ధర రూ.14 లక్షల నుంచి రూ.13.20 లక్షలకు తగ్గింది. ప్రస్తుతం రూ.11.69 లక్షలు ఉంది. ఎఫ్‌ఎంసీజీ రంగంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అనేక నిత్యావసర వస్తువులపై జీఎస్టీని 12 శాతం లేదా 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీనివల్ల మొదట్లో ధరలు సుమారు 10 శాతం తగ్గాయి. అయితే ముడిసరుకులు, ఇంధనం, లాజిస్టిక్స్ ఖర్చులు ఎక్కువ కావడంతో కంపెనీలు ధరలను 6–7 శాతం వరకు పెంచాయి.
పశ్చిమాసియా సంక్షోభం వల్ల కూడా ద్రవ్యోల్బణం పెరిగింది. సబ్బులు, హార్లిక్స్, పళ్ల రసాలు, నూడుల్స్ వంటి వాటి ధరలు పెద్దగా మారలేదు. జీఎస్టీ 2.0 వల్ల ఇప్పటికీ ధరలు 2–3 శాతం తక్కువ ఉన్నాయని పార్లే ఫుడ్స్ తెలిపింది. జీఎస్టీ 2.0తో దుస్తుల రంగం మాత్రం నష్టపోయింది. రూ.2,500 కంటే ఎక్కువ ధర ఉన్న వాటిపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు.
దీంతో పండుగ, ప్రత్యేక సందర్భాల దుస్తుల అమ్మకాలు తగ్గాయి. తయారీదారులు, బ్రాండ్లు, రిటైలర్లు కొంత భారాన్ని భరిస్తున్నందున పండుగ సీజన్లో ధరలు 5–7 శాతం వరకు పెరగవచ్చని క్లాథింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అంచనా వేసింది. మధ్యతరహా హోటళ్లపై జీఎస్టీని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీనివల్ల మార్జిన్లు తగ్గాయి. దీపావళి నాటికి కంపెనీలు ధరలను మరోసారి పెంచవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
