హైదరాబాద్ లోని డైరీ యూనిట్లలో TG SAFE నిర్వహిస్తున్న దాడుల్లో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల అధికారులు సిటీలోని డైరీల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి పలు డైరీలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ( సెప్టెంబర్ 22 ) హైదరాబాద్ హయత్ నగర్ లోని డైరీల్లో టీజీ సేఫ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పలు డైరీల్లో భారీగా ఈగలు, తుప్పు పట్టిన పైపులు,పరికరాలు గుర్తించామని తెలిపారు అధికారులు.
డైరీల్లో నీటి పరీక్షలు, పెస్ట్ కంట్రోల్, ఫుడ్ హ్యాండ్లర్ల హెల్త్ రికార్డులు లేకపోవడం గుర్తించామని.. తేమ ఉన్న ప్రాంతాల్లో మౌల్డ్, నీటి నిల్వతో దెబ్బతిన్న ఫ్లోరింగ్ గుర్తించామని తెలిపారు అధికారులు. పలు డైరీ యూనిట్లలో రస్ట్ పట్టిన పరికరాలు, పైపులు గుర్తించామని.. డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణలో లోపాలు ఉన్నాయని అన్నారు అధికారులు.
కల్తీపై అనుమానంతో 18 డైరీల నుంచి పాల నమూనాలు సేకరించామని.. 10 డెయిరీ యూనిట్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశామని తెలిపారు అధికారులు.
హయత్‌నగర్ లోని వెంకట శివ మిల్క్ పాయింట్ FSSAI లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర పరిస్థితుల్లో నిర్వహిస్తునట్లు గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. సప్తగిరి ఫుడ్స్, ఆల్ రిచ్ డెయిరీ FSSAI లైసెన్సులు రద్దు చేశామని తెలిపారు.
