అవునా నిజమా : పూర్తిగా 100 శాతం ఇథనాల్ తో నడిచే కారు వచ్చేస్తోంది..

అవునా నిజమా : పూర్తిగా 100 శాతం ఇథనాల్ తో నడిచే కారు వచ్చేస్తోంది..

E20 పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం ( సెప్టెంబర్ 22 ) ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. E20 పెట్రోల్ వల్ల ఎలాంటి సమస్యలు లేవని... ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదని అన్నారు. అక్టోబర్ నెలలోనే వంద శాతం ఇథనాల్ కారు లాంచ్ చేయబోతున్నామని అన్నారు నితిన్ గడ్కరీ.

అక్టోబర్ జరగనున్న టొయోటా ఇన్నోవా 100 శాతం ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచింగ్ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిందని.. ఈ కార్ వంద శాతం ఇథనాల్‌ తో నడుస్తుందని, నడుస్తున్నప్పుడు 60 శాతం వరకు విద్యుత్‌ ను ఉత్పత్తి చేయగలదని పేర్కొన్నారు గడ్కరీ.

పెట్రోల్ ధరలతో పోలిస్తే ఇథనాల్ వాడకం వల్ల అయ్యే ఖర్చు లీటరుకు సుమారు రూ. 25 ఉండచ్చని అన్నారు గడ్కరీ. వంద శాతం ఇథనాల్ వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని.. త్వరలో లాంచ్ అవనున్న కార్ కి సంబంధించిన సాంకేతిక వివరాలు, ఇంధన సామర్థ్యం, వంటి కీలక వివరాలు ఫైనల్ ప్రాడక్ట్ లాంచ్ అయ్యాక తెలుస్తాయని అన్నారు.

పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్‌ను కలిపిన E20 పెట్రోల్, జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో ఒక భాగమని.. ఇటీవల ఇది కొంతమంది విమర్చించినట్లుగా E20 వల్ల ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు గడ్కరీ. మొక్కజొన్న నుండి ఇథనాల్ ఉత్పత్తి చేయడం వల్ల ఉత్తర ప్రదేశ్, బీహార్‌లోని రైతులకు కూడా ప్రయోజనం చేకూరిందని ఆయన అన్నారు.