మూడు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్

మూడు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు రాష్ట్రంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ఈ మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో 204 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. 

ముఖ్యంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ఇక హైదరాబాద్ నగరంలోనూ ఇవాళ( మంగళవారం) సాయంత్రం అల్వాల్, బాలానగర్, కుత్భుల్లాపూర్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్, చార్మినార్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపారు.