హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వాయుగుండం హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు , ట్రాఫిక్ కమిషనర్లు అంతా సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలవకుండా తక్షణమే యంత్రాలను, సిబ్బందిని రంగంలోకి దించాలని సూచించారు.
భారీ వర్షాల వేళ విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు పొంచి ఉన్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నాలాలు అలాగే డ్రైనేజీల్లో నీటి ప్రవాగానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు.
పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు సహాయక బృందాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేస్తూ ప్రజల ఫిర్యాదులను స్వీకరించాలని, అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం తేల్చిచెప్పారు.
