హైదరాబాద్ లోని దమ్మాయిగూడలో ఉన్న ఎక్సలెన్సియా జూనియర్ కాలేజీని సీజ్ చేశారు అధికారులు. ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండా, ఫోర్జరీ ఎల్ఓసీతో కాలేజీ నిర్వహిస్తున్నారంటూ తెలంగాణ స్టూడెంట్స్ యూనిట్ ఫిర్యాదు చేయడంతో మంగళవారం ( సెప్టెంబర్ 22 ) కాలేజీని సీజ్ చేశారు అధికారులు.
తెలంగాణ స్టూడెంట్స్ యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మను చౌదరికి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మేడ్చల్ జిల్లా డీఈఓ కాలేజీని సీజ్ చేశారు.
గతంలోనే కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు విచారణ చేపట్టగా, కళాశాల యాజమాన్యం అక్రమ ఫైర్ ఎన్‌ఓసీ పత్రాలను సమర్పించినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. దీంతో కళాశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసి రూ.8 లక్షల జరిమానా విధించారు అధికారులు. అడ్మిషన్లు నిలిపివేయడంతోపాటు కళాశాల నిర్వహణను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.
అధికారుల ఆదేశాలను యాజమాన్యం పట్టించుకోకుండా కళాశాలను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను గుర్తింపు పొందిన ఇతర కళాశాలల్లో చేర్పించాలని కోరుతూ ప్రవీణ్ కుమార్ మరోసారి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతో డీఐఈఓ స్వయంగా కళాశాలను సందర్శించి తనిఖీ నిర్వహించి, కళాశాలను బంద్ చేసి సీజ్ చేశారు.
