ఛండీఘర్: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి మద్దతు కోసం ప్రయత్నిస్తోన్న ఎన్డీఏ సర్కార్‌కు భారీ ఊరట దక్కింది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుకు శిరోమణి అకాలీ దళ్ మద్దతు ప్రకటించింది. ప్రధాని మోడీతో శిరోమణి అకాలీ దళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ భేటీ అయిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడం చర్చనీయాంశంగా మారింది.
ఈ మేరకు శనివారం (ఆగస్ట్ 8) సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన అనంతరం మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళల గౌరవం, సమానత్వం, సమాన హక్కుల కోసం పోరాడిన సిక్కు గురువుల బోధనల నుంచి శిరోమణి అకాలీ దళ్ స్ఫూర్తి పొందుతుందని పేర్కొన్నారు. శిరోమణి గురుద్వారా పర్బందక్ కమిటీ తమ సభలో మహిళా రిజర్వేషన్‌కు నిబంధన కల్పించడం ద్వారా ఇప్పటికే ఒక ఉదాహరణను నెలకొల్పిందని అన్నారు.
అలాగే, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా న్యాయమైన, సమానమైన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కోరారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను శిరోమణి అకాలీ దళ్ సమర్థిస్తోందని ప్రకటించారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనను తక్షణమే చేపట్టాలని కోరారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదానికి మద్దతు కోసం ప్రయత్నిస్తోన్న వేళ శిరోమణి అకాలీ దళ్ ప్రకటన కేంద్రంలోని మోడీ సర్కార్‌కు భారీ ఊరట కలిగించింది. కాగా, శిరోమణి అకాలీదళ్‌కు లోక్ సభలో ఒక ఎంపీ ఉన్నారు.
