The Paradise Special: ‘ది ప్యారడైజ్’ కోసం మైత్రి థియేటర్స్ క్రేజీ ప్లాన్.. ఇంటర్వెల్‌లో స్నాక్స్గా సర్వపిండి!

The Paradise Special: ‘ది ప్యారడైజ్’ కోసం మైత్రి థియేటర్స్ క్రేజీ ప్లాన్.. ఇంటర్వెల్‌లో స్నాక్స్గా సర్వపిండి!

నాని హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (సెప్టెంబర్ 23) ప్రీమియర్ షోలతో సందడి చేయనుండగా.. రేపు (సెప్టెంబర్ 24) వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో నాని, ‘ది ప్యారడైజ్’ టీమ్ మొదటి నుంచి వినూత్నతకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు థియేటర్‌లో మరో స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. సినిమా ఇంటర్వెల్‌లో తెలంగాణ ఫేమస్ సర్వపిండిని అందించనున్నారు. హైదరాబాద్‌లోని మైత్రి విమల్, మైత్రి శివగంగ థియేటర్లలో ‘ది ప్యారడైజ్’ చూసే ఆడియన్స్‌కు ఈ తెలంగాణ స్పెషల్ ట్రీట్ లభించనుంది. 

ఇంటర్వెల్‌లో స్నాక్స్గా సర్వపిండి..

‘ది ప్యారడైజ్’ సినిమా నైజాం (తెలంగాణ) ప్రాంత డిస్ట్రిబ్యూషన్ హక్కులను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నేటివిటీకి తగ్గట్టుగా ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు మైత్రీ థియేటర్స్ ఓ వినూత్న ప్లాన్‌తో ముందుకొచ్చింది. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్‌లో స్నాక్స్‌గా తెలంగాణ ఫేమస్ సర్వపిండిని అందించనుంది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

77 ఏళ్ల బామ్మ చేతి సర్వపిండి..

సర్వపిండి తెలంగాణ వంటకాలలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంప్రదాయ రుచుల్లో ఒకటి. బియ్యప్పిండి, పప్పులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మసాలా దినుసులతో తయారయ్యే ఈ వంటకం బయటకు క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. ముఖ్యంగా ఇంటి వంటను గుర్తుచేసే ఈ తెలంగాణ సంప్రదాయ వంటకానికి ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో ఇప్పుడు స్పెషల్ ప్లేస్ దక్కింది.

ఇక #BaammaStoriesలో 77 ఏళ్ల బామ్మ ప్రేమగా తయారు చేసిన సర్వపిండి.. ఓ చిన్న టిఫిన్ సెంటర్ నుంచి ఏకంగా తెలంగాణలోని బిగ్ స్క్రీన్‌ల వరకు చేరడం ఆసక్తికరంగా మారింది. సినిమా కథ తెలంగాణ నేపథ్యంలో సాగుతుండటంతో.. అదే ప్రాంతానికి చెందిన సంప్రదాయ రుచిని ప్రేక్షకులకు అందించాలనే ఈ ఆలోచనకు మరింత ప్రత్యేకత వచ్చింది. అలా తెరపై తెలంగాణ నేటివిటీని చూపించడంతో పాటు.. ఇంటర్వెల్‌లో తెలంగాణ రుచిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేయనుంది ‘ది ప్యారడైజ్’ టీమ్.

‘ది ప్యారడైజ్’ కథకు తగ్గట్టుగానే..

ఇక ఈ సర్వపిండి ట్రీట్‌ను ఎంచుకోవడం వెనుక కూడా ఓ ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. ‘ది ప్యారడైజ్’ కథ తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథనం ఉండటంతో.. తెలంగాణ సంస్కృతి, స్థానికత, అక్కడి జీవనశైలి, నేటివిటీని ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాలనే ఆలోచనలో భాగంగానే ఈ స్పెషల్ ట్రీట్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

సినిమాను కేవలం తెరపై చూపించడమే కాకుండా.. తెలంగాణ కథను థియేటర్‌లో రుచితోనూ అనుభవించేలా చేయాలనే కాన్సెప్ట్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ఒకవైపు సికింద్రాబాద్–ఆదిలాబాద్ నేపథ్యంలోని కథ.. మరోవైపు అదే తెలంగాణ మట్టిలో పుట్టిన సర్వపిండి. దీంతో ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో ఈ ఐడియా ప్రత్యేక ఆకర్షణగా మారింది.

థియేటర్‌లో సినిమా చూస్తూ ఇంటర్వెల్‌లో తెలంగాణ సంప్రదాయ రుచిని ఆస్వాదించడం.. ప్రేక్షకులకు స్క్రీన్‌పై కనిపించే కథతో పాటు తెలంగాణ నేటివిటీని మరో ఇంద్రియంతోనూ ఫీల్ అయ్యే అనుభూతిని ఇవ్వనుంది. మరి ఈ వినూత్న ప్రమోషన్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.