ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తా అనుమతివ్వండి..సీఎం రేవంత్ కు నాని రిక్వెస్ట్

ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ప్రేక్షకులతో కలిసి  సినిమా చూస్తా అనుమతివ్వండి..సీఎం రేవంత్ కు నాని రిక్వెస్ట్

 టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం 'ది ప్యారడైజ్' (The Paradise). ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23నే తెలంగాణలో ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు.

ఈ ప్రీమియర్ షో సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి హీరో నాని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో సినిమా చూడటమంటే తనకు చాలా ఇష్టమని, ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్లలో సినిమా అనుభూతే వేరని అన్నారు నాని. 

ది ప్యారడైజ్' ప్రీమియర్ షో రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఒక థియేటర్‌ను సందర్శించి, ఎవరికోసమైతే ఈ సినిమా తీశామో ఆ ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమాను చూడాలని ఆశపడుతున్నట్లు నాని తెలిపారు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తూ వారి స్పందనను ప్రత్యక్షంగా అనుభవించడంలోనే ఒక నటుడిగా తనకు అసలైన తృప్తి దొరుకుతుందని ఆయన భావోద్వేగంతో పంచుకున్నారు.

అలాగే ఈ సందర్శనలో భాగంగా అన్ని రకాల భద్రతా నిబంధనలను, ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తామని, తమకు భద్రతే మొదటి ప్రాధాన్యత అని నాని స్పష్టం చేశారు. తన ఈ అభ్యర్థనను  సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరి నాని చేసిన ఈ రిక్వెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి  ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో తీవ్ర ఆసక్తికరంగా మారింది.