డెలివరీ బాయ్స్ EV బైక్స్ మాత్రమే వాడాలి.. ప్రభుత్వం కొత్త రూల్

డెలివరీ బాయ్స్ EV బైక్స్ మాత్రమే వాడాలి.. ప్రభుత్వం కొత్త రూల్

మహారాష్ట్రలో ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ సంస్థలకు అక్కడి ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి డెలివరీ ప్లాట్‌ఫామ్‌లను బైక్ ట్యాక్సీ నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర రవాణా శాఖ ప్రతిపాదించింది. ఈ సవరణలు అమల్లోకి వస్తే డెలివరీ సేవలకు ఉపయోగించే వాహనాల విషయంలో ఈవీల వాడకం తప్పనిసరి కానుంది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌లు కేంద్ర చట్టాల పరిధిలోనే పనిచేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో వాటి కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అక్కడ ప్రభుత్వం భావిస్తోంది.

ఇక ఈవీలతోనే డెలివరీ?
ప్రతిపాదిత సవరణలు అమల్లోకి వస్తే డెలివరీ సర్వీస్ ప్రొవైడర్లు ఎలక్ట్రిక్ వాహనాల ఫ్లీట్‌ను నిర్వహించాల్సి రావచ్చు. పార్సిళ్లు, ప్యాకేజీలను తరలించే వాహనాల యజమానులు, వాటిని నిర్వహించే సంస్థలను ‘డెలివరీ సర్వీస్ ప్రొవైడర్లు’గా నిర్వచించాలని ప్రతిపాదించారు. వాహనాలకు GPS ట్రాకింగ్, డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ప్రత్యేక లైసెన్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ వంటి నిబంధనలు కూడా ఉండనున్నాయి.

డ్రైవర్ల సంక్షేమానికి 2 శాతం..
కొత్త ప్రతిపాదనలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి రైడ్‌ ఫేర్‌లో 2 శాతాన్ని డ్రైవర్ వెల్ఫేర్ ఫండ్‌కు ప్లాట్‌ఫామ్‌లు చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. ఈ నిధులను పెన్షన్ ప్రయోజనాలు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఎలక్ట్రిక్ వాహనాల కొనేందుకు లోన్స్, డ్రైవర్ల పిల్లల చదువుకు సహాయం వంటి కార్యక్రమాలకు వినియోగించాలని భావిస్తున్నారు. దీంతో డెలివరీ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది డ్రైవర్లకు సామాజిక భద్రత కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

ALSO READ : 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నో..

15 కిలోమీటర్ల పరిధిలోనూ వర్తింపు..
15 కిలోమీటర్లలోపు ప్రయాణించే బైక్‌లను కూడా ప్రతిపాదిత విధానంలోకి తీసుకురానున్నారు రవాణా మంత్రి ప్రతాప్ సర్ణాయక్. ఈ నిబంధనలకు సంబంధించిన సవరణలను ఇప్పటికే రాష్ట్ర న్యాయ, న్యాయశాఖ పరిశీలనకు పంపారు. ఆమోదం పొందిన తర్వాత ఈవీ ఫ్లీట్, GPS, ఇన్సూరెన్స్, లైసెన్సింగ్ వంటి రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం కూడా ఈ మార్పుల లక్ష్యాల్లో ఒకటని మంత్రి తెలిపారు.

డెలివరీ రంగంపై పర్యవేక్షణ..
ప్రస్తుతం ఈ-కామర్స్, డిజిటల్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు మహారాష్ట్రలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర బైక్ ట్యాక్సీ నిబంధనల పరిధిలో లేవు. దీంతో వివాదాలు, ఫిర్యాదుల సమయంలో బాధ్యత నిర్ధారించడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. కొత్త రూల్స్ రాకతో వాహనాల రియల్‌టైమ్ మానిటరింగ్ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ, హర్యానాల్లో డెలివరీ, రైడ్ అగ్రిగేటర్ ఫ్లీట్ల ఈవీలుగా మార్చేందుకు నిబంధనలు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రతిపాదన అమల్లోకి వస్తే దేశంలో డెలివరీ రంగాన్ని ఈవీల వైపు మళ్లించే కీలక నిర్ణయాల్లో ఇది ఒకటిగా నిలవనుంది.