ముంబై: తన ఇంట్లో భద్రతా విధుల్లో నియమించబడిన సబ్-ఇన్‌స్పెక్టర్ (పీఎస్ఐ)పై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చీఫ్ అభిజిత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసుల్లా ప్రవర్తించవద్దని మందలించారు. తనను కలవడానికి వచ్చిన ప్రజలను అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. తన కోసం వచ్చే వారితో అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. తనను ఎవరు కలవాలో.. ఎవరు కలవద్దో అతడి చెప్పడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేశారు అతడిని వెంటనే విధుల నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటుతో అభిజిత్ దీప్కే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. దీంతో దీప్కేను కలిసేందుకు అతడి ఇంటికి యువత, ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ వాలుజ్ MIDC ప్రాంతంలో ఉన్న దీప్కే నివాసం దగ్గర మహారాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్-ఇన్స్పెక్టర్ను భద్రతా విధుల్లో నియమించింది.
అయితే, సదరు సబ్-ఇన్‌స్పెక్టర్ రూడ్‌గా బిహేవ్ చేస్తున్నాడని దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశాడు. నీట్ నిరసన సమయంలో యువతపై ఢిల్లీ పోలీసులు ప్రవర్తించినట్లుగా బిహేవ్ చేయొద్దని అతడిని మందలించాడు. తనను కలిసేందుకు వచ్చే వారిని అడ్డుకోవడంతో పాటు అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడని సీరియస్ అయ్యాడు. అతడి తన ఇంటి దగ్గర భద్రతా విధుల నుంచి తొలగించాలని దీప్కే కోరారు. దీప్కే అభ్యర్థనపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
