ఫోటో మార్ఫింగ్, డీప్‌ఫేక్‌, తప్పుడు పోస్టులపై కేంద్రం సీరియస్.. మెటాకు గట్టి వార్నింగ్.. అల్గారిథమ్స్ మార్చాల్సిందే..

 ఫోటో మార్ఫింగ్, డీప్‌ఫేక్‌, తప్పుడు పోస్టులపై కేంద్రం సీరియస్.. మెటాకు గట్టి వార్నింగ్.. అల్గారిథమ్స్ మార్చాల్సిందే..

సోషల్ మీడియాలో విపరీతంగా పెరుగుతున్న డీప్‌ఫేక్‌లు, తప్పుదోవ పట్టించే పోస్టులు, ఫేక్ ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

ప్లాట్‌ఫారమ్‌లలో చట్టవిరుద్ధమైన, తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను అరికట్టడానికి వెంటనే  అల్గారిథమ్‌లను మార్చాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.

కేంద్రం నుంచి మెటాకు అందిన ఆదేశాలు ఇవే:
 *డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, తప్పుడు ప్రచారాలు ఆటోమేటిక్‌గా వైరల్ కాకుండా నిరోధించేలా మెటా అల్గారిథమ్‌లను పూర్తిగా మార్పులు చేయాలి.
*చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించమని ప్రభుత్వ అధీకృత ఏజెన్సీలు కోరినప్పుడు, తక్షణమే ఎలాంటి ఆలస్యం లేకుండా చాలా వేగంగా స్పందించి వాటిని తొలగించాలి.
*హానికరమైన పోస్టులను గుర్తించి, వాటిని ఏరిపారేసే వ్యవస్థలను (కంటెంట్ మోడరేషన్ సిస్టమ్స్) మరింత బలోపేతం చేయాలి. 
*తప్పుడు సమాచారాన్ని, ఫేక్ కంటెంట్‌ను అడ్డుకోవడంలో ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలి.
*డేటా నిబంధనలు, భారతదేశం విధించిన డేటా-స్థానికీకరణ (Data Localization) అవసరాలకు తప్పకుండా కట్టుబడి ఉండాలి.

సమావేశంలో ఏం జరిగింది?
ఇటీవల MeitY అధికారులకు, మెటా సాంకేతిక బృందానికి మధ్య జరిగిన భేటీలో ఈ అంశాలపై తీవ్ర చర్చ జరిగింది. మెటా ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన కంటెంట్‌ను అడ్డుకోవడానికి ప్రస్తుతం వాడుతున్న పద్ధతులను మెటా బృందం వివరించింది. అయితే, ఆ ఏర్పాట్లు సరిపోవని, డీప్‌ఫేక్‌ల కట్టడికి మరింత పటిష్టమైన, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వ అధికారులు తేల్చిచెప్పారు.

ప్రస్తుత వ్యవస్థల్లోని లోపాలను మెటా కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ అంశంపై చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాబోయే రోజుల్లో ఇరుపక్షాల మధ్య మరోసారి సమావేశం జరగనుంది.