హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్ బుక్ చేస్తున్న ఇంటి ఓనర్లకు ముఖ్య గమనిక

హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్ బుక్ చేస్తున్న ఇంటి ఓనర్లకు ముఖ్య గమనిక

హైదరాబాద్: హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్ బుక్  చేస్తున్న ఇంటి ఓనర్లకు ముఖ్య గమనిక. జలమండలి సిటిజన్ సర్వీసెస్ మొబైల్ అప్లికేషన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. మొబైల్ అప్లికేషన్ ద్వారా ట్యాంకర్ బుకింగ్ సేవలకు తాత్కాలిక అంతరాయం కలిగింది.

జలమండలి సాంకేతిక బృందం సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది. IVRS ద్వారా ట్యాంకర్ బుకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని జలమండలి అధికారులు ప్రకటించారు. జలమండలి అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ట్యాంకర్ బుకింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపారు.

మొబైల్ అప్లికేషన్ సేవలు పునరుద్ధరించే వరకు IVRS, వెబ్‌సైట్ సేవలను వినియోగించుకోవాలని వినియోగదారులకు సూచించారు. సాంకేతిక సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి మొబైల్ అప్లికేషన్ సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాత్కాలిక అంతరాయం పట్ల వినియోగదారులు సహకరించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా వెస్ట్ సిటీలో పెరుగుతున్న నీటి సమస్య కారణంగా మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. నగరంలో 86 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. తాజాగా 96 ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు, అలాగే ఫిల్లింగ్ పాయింట్లను 141 నుంచి 167కు పెంచినట్టు జలమండలి అధికారులు చెప్పారు.

ట్యాంకర్ల సంఖ్య 1,135 నుంచి 1,250కి పెంచినట్టు తెలిపారు. ట్యాంకర్ల రవాణా సమయాన్ని తగ్గించేందుకు అదనపు ట్రిప్పులు, అదనపు సిబ్బందిని రంగంలోకి దింపామని, వారం రోజుల క్రితం వరకూ బుకింగ్ జరిగిన 24 గంటల్లోనే డెలివరీ చేసే అవకాశం ఉండగా ప్రస్తుతం కొంత ఆలస్యం అవుతున్నట్టు వెల్లడించారు.