UPI లావాదేవీలపై ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్న వార్తలపై ఫోన్ పే సీఈవో సమీర్ నిగమ్ స్పందించారు. వినియోగదారులకు UPI చెల్లింపులు ఫోన్ పేలో ఉచితంగానే కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. UPI వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు లేవని ఫోన్‌పే సీఈఓ స్పష్టం చేశారు. రూ. 2 వేల కంటే ఎక్కువ మొత్తంలో చేసే UPI వ్యాపార లావాదేవీలకు MDR (మర్చంట్ డిస్కౌంట్ రేట్) వర్తించవచ్చని ఫోన్ పే సీఈవో తెలిపారు. ఈ మేరకు స్పష్టత ఇస్తూ ఆయన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
𝐔𝐏𝐈 𝐢𝐬 𝐚𝐧𝐝 𝐰𝐢𝐥𝐥 𝐫𝐞𝐦𝐚𝐢𝐧 𝐟𝐫𝐞𝐞 𝐟𝐨𝐫 𝐚𝐥𝐥 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐜𝐨𝐧𝐬𝐮𝐦𝐞𝐫𝐬!
— Sameer Nigam (@_sameernigam) August 8, 2026
‘Consumers will NOT BE CHARGED anything for making UPI payments.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)తో పాటు ఇతర నోటిఫైడ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాలపై చార్జీలు విధించేందుకు బ్యాంకులకు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇప్పటికే అనుమతి లభించిన సంగతి తెలిసిందే. యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించే బిల్లు ఆమోదం పొందింది. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్మెంట్) బిల్ –2026 పేరిట రూపొందిన ఈ బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 బిల్లు, ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ –2025 బిల్లు, ది ఫైనాన్స్ యాక్ట్-2026 బిల్లులకు సవరణలు చేశారు.
పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 (సవరణ) ద్వారా ఇప్పటివరకూ యూపీఐ, ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్లపై వ్యాపారులకు బ్యాంకులు అందిస్తున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) రద్దవుతుంది. ఈ మేరకు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007లోని సెక్షన్ 10ఏకు కీలక సవరణలు చేశారు.
దీని వల్ల బ్యాంకులు, డిజిటల్ రంగానికి నిలకడైన ఆదాయ నమూనా అందుబాటులోకి రానున్నది. 'ట్యాక్సేషన్ బిల్లు' ద్వారా విదేశీ మూలధనాన్ని ఆకర్షించడం, ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడంతోపాటు విదేశీ క్లౌడ్ కంపెనీలు భారత డేటా సెంటర్లను వాడుకునేలా నిబంధనలను స్పష్టం చేయడానికి వీలు కలుగుతుంది.
