No Indian Umpire: ఆగస్టు 15వ తేదీ నుంచి నెదర్లాండ్స్, బెల్జియం దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న హాకీ వరల్డ్ కప్ రచ్చ షురువైతంది. కానీ విచిత్రం ఏందంటే.. ఈ పెద్ద టోర్నీల ఈసారి సిటీ నుంచి గల్లీ దాకా ఒక్కడంటే ఒక్క భారతీయ అంపైర్ గాని, టెక్నికల్ ఆఫీసర్ గాని కనిపించకపోవడం. 1998 యూట్రెక్ట్ వరల్డ్ కప్ తర్వాత ఇలా ఇండియన్స్ పత్తా లేకుండా పోవడం మళ్లీ ఇప్పుడే. 28 ఏండ్ల నుంచి ఏదో రకంగా మనోళ్ల గొంతు అక్కడ వినిపించేది, ఈసారి మాత్రం మొత్తం యూరోపోళ్లదే హవా నడుస్తోంది. అసలు భారత వ్యవస్థ ఎటు పోతుందో అర్థం కాక అభిమానులు బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు.
యూరోపియన్ అంపైర్లతో ఎట్లా పోటీ పడతరు?:
గతంలో అమర్‌జిత్ సింగ్ బావా, తార్లోక్ సింగ్, సతీందర్ శర్మ, ఆర్.వీ రఘు ప్రసాద్ లాంటోళ్లు గ్రౌండ్ల నిలబడి భారతదేశం ఇజ్జత్ కాపాడిండ్రు. పోయినేడే అంపైరింగ్‌కు గుడ్ బై చెప్పిన రఘు ప్రసాద్ మాట్లాడుతూ.. ఎఫ్‌ఐహెచ్ (FIH) ఊరికే ఎంపిక చేయదు, అంతర్జాతీయ మ్యాచ్‌లలో నిలకడగా పర్ఫార్మెన్స్ ఉండాలె.. మరి ఇండియన్ అంపైర్లకు ఆ రేంజ్ మ్యాచ్‌లు ఆడిచ్చేది ఎవరు? మన నేషనల్ క్యాంప్‌లలో ఆటగాళ్లతో పాటు అంపైర్లకు కూడా చోటు ఇచ్చి, ఆధునిక హాకీ రూల్స్ నేర్పించకపోతే వాళ్లు యూరోపియన్ అంపైర్లతో ఎలా పోటీ పడతరు? అని ప్రశ్నించాడు.
భారత అంపైర్లకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదో తెలుసా:
మాజీ అంపైర్ సతీందర్ శర్మ చెప్పిన మాటలు వింటే మన దేశంలో అంపైరింగ్ ఎందుకు అటకెక్కిందో ఈజీగా అర్థమైతది. రోజుకు డొమెస్టిక్ మ్యాచ్‌లకు రూ. 150-200 ఇస్తే, ఇంటర్నేషనల్ పోరుకు 40-50 డాలర్లు విసిరేస్తే.. ఏ కుర్రోడైనా ఈ అంపైరింగ్ ముఖం చూస్తాడా? తిండికి, తిరుగుడుకే సరిపోని పైసలిస్తే ఆర్థిక భద్రత ఎక్కడి నుంచి వస్తది?.. హాకీ ఇండియా దగ్గర వందల మంది ఆఫీసర్లు ఉన్నరని పేపర్ మీద లెక్కలు బాగానే ఉన్నాయి.. కానీ, ఎఫ్‌ఐహెచ్ ప్యానెల్‌ల మనోళ్లు వేళ్ల మీద లెక్కపెట్టేంత మందే మిగిలిండ్రు. ఇప్పటికైనా నిద్రలేచి పక్కా ప్లాన్ ఏసి, అంపైర్లకు సరిపడా పైసలు, ప్రోత్సాహం ఇవ్వకపోతే.. వచ్చే ఒలింపిక్స్, వరల్డ్ కప్‌ల మనోళ్లను ఆఫీసర్లుగా చూడడం ఉట్టి కల్లే అయితది.
