కర్నాటకలో 27 ఏళ్ల యువ మోడల్ అనుమానాస్పద మృతి

కర్నాటకలో 27 ఏళ్ల యువ మోడల్ అనుమానాస్పద మృతి

బెంగళూర్: కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో దారుణం జరిగింది. 27 ఏళ్ల మోడల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. మోడలింగ్‎లో రాణిస్తోన్న కృతి బంగేరా అనే యువతి ఆమె తల్లి, సోదరితో కలిసి ఉడుపి జిల్లా మాల్పె పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్మాడిలో నివాసం ఉంటోంది. ఉడుపిలోని కడియాలి సమీపంలో ఓ ప్రైవేట్ హోటల్‌లో పని చేస్తోంది. ఏమైందో తెలియదు గానీ గత ఐదు నెలలుగా ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది. 

ఆగస్టు 6న ఆమె తల్లి రత్న, సోదరి పని మీద బయటకు వెళ్లారు. ఈ సమయంలో కృతి తన గదిలో ఫ్యాన్‎కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగొచ్చిన తల్లి కృతిని పిలువగా ఎంతసేపటికీ గది నుంచి బయటకు రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లి వెంటనే కృతి మేనమామకు సమాచారం అందించింది. అతడు వెంటనే ఇంటికి వచ్చి కృతి గది తలుపు పగలగొట్టి చూడగా.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కృతి విగతజీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

ALSO READ : ఎంత చదివినా మైండ్‌లోకి ఎక్కట్లేదా ?

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కృతి మృతదేహాన్ని పోస్ట్‎మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత కొన్ని రోజులుగా కృతి తీవ్ర ఒత్తిడికి గురవుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. కృతి మృతికి ఒత్తిడేనా లేక మరేదేమైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.