రేపటి (ఆగస్ట్ 8) నుంచి ర్యాపిడో, ఉబర్, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ బంద్ !

రేపటి (ఆగస్ట్ 8) నుంచి ర్యాపిడో, ఉబర్, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ బంద్ !

హైదరాబాద్: తెలంగాణలో గిగ్ వర్కర్లు మరోసారి సమ్మె బాట పడుతున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఆగస్ట్ 8 నుంచి తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.

రాష్ట్ర ప్రభుత్వం, ప్లాట్‌ఫామ్ కంపెనీలతో నెలల తరబడి చర్చలు జరిపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్ల ఫోరం (TADF), తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల యూనియన్ (TGPWU) సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో.. ఆగస్ట్ 8 నుంచి తెలంగాణ వ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఉబర్, ఓలా సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది.

ALSO READ : హైదరాబాద్‌లో ఫన్నీ చోరీ: కెమెరాకే ఫోజులిస్తూ పాల డబ్బాలు కొట్టేసిన దొంగ

కనీస బేస్ ఛార్జీని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయాలని టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ నిబంధనలను తక్షణమే నోటిఫై చేయాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు, 2025ను అమలు చేయాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు. దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. హైదరాబాద్ నాంపల్లిలోని గిగ్ ఆఫీస్లో సమావేశమైన 16 గిగ్ వర్కర్ల కార్మిక సంఘాలు ఆగస్ట్ 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించాయి.