తెలంగాణ గడ్డపై మరో క్రీడా సంబరానికి రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 23 వరకు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 పోటీలను విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో సచివాలయంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. పోటీల ఏర్పాట్లపై శాఖల వారీగా సుదీర్ఘంగా చర్చించారు. క్రీడా వేదికల సిద్ధత, వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహారం, పరిశుభ్రత , ప్రచార కార్యక్రమాలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యువ క్రీడాకారులకు తెలంగాణలో అత్యుత్తమ వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఏ ఒక్క విభాగంలోనూ లోపాలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఇటువంటి జాతీయ స్థాయి పోటీలు మన రాష్ట్ర యువ క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునే గొప్ప వేదిక అని, గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఆతిథ్య వైభవాన్ని, రాష్ట్ర క్రీడా ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసేలా అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
